విశాఖ రైల్వేస్టేషన్ బయట పోలీసుల పహారా
సాక్షి, అమరావతి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించారు.
సైన్యంలో అగ్నిపథ్ కార్యక్రమం కింద నియామకాలను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌తో పాటు ఉత్తరాదిలో కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో రాష్ట్రంలో రైల్వే భద్రత దళం (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) విభాగాలతో పాటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టపరిచారు.
భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ
డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతోపాటు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్షించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం, అనకాపల్లి తదితర రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలతో పోలీసు అధికారులు చర్చించారు.
వారి వద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులెవరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా అభ్యర్థులు తమ సమస్యలను ప్రభుత్వానికి శాంతియుతంగా విన్నవించుకోవాలన్నారు. అంతేగానీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి వారు భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడంతోపాటు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
టికెట్లు చూపిస్తేనే స్టేషన్‌లోకి అనుమతి
విజయవాడ రైల్వే స్టేషన్‌కు అదనంగా 200 మంది పోలీసులను తరలించారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులను ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్నవారినే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో పాటు పలువురు పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్ వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
విజయవాడ డీఆర్‌ఎం శివేంద్రమోహన్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తిరుపతి, విశాఖపట్నం రైల్వే స్టేషన్ల వద్ద కూడా అదనంగా వందమంది చొప్పున రాష్ట్ర పోలీసులను మోహరించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్‌లలో, రైల్వే కాలనీలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే, పోలీస్ యంత్రాంగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రయాణించాల్సిన 28 రైళ్లను పూర్తిగా, 19 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరో 8 రైళ్లను దారి మళ్లించగా, రెండు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ప్రయాణికుల సమాచారం కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో 0866–2767055 నంబర్‌తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
పరిస్థితి అదుపులో ఉంది
రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అభ్యర్థులు, యువకులు ఎవరూ దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం. పోలీసు ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment