
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే.
టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు.
వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీవారిఆలయ సమీపంలో విమానాలు
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి విమానం మరోమారి వెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30, 8.15 గంటల సమయంలో విమానాలు ఆలయం పైభాగాన సమీపంలో వెళ్లాయి. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. అయితే తరచూ తిరుమల పైభాగంలో పలు విమానాలు వెళుతున్నాయి. ప్రస్తుతం విమానాలు తిరుమలపై వెళ్లడంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు.