మా ఆశలు చచ్చిపోయాయి | Relief for Accused in Rishiteshwari Suicide Case | Sakshi
Sakshi News home page

మా ఆశలు చచ్చిపోయాయి

Published Sat, Nov 30 2024 7:46 AM | Last Updated on Sat, Nov 30 2024 10:56 AM

Relief for Accused in Rishiteshwari Suicide Case

న్యాయం జరగలేదు.. గంగలో దూకడమే శరణ్యం

పాప డైరీని ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదో అర్థంకావడంలేదు

న్యాయస్థానం కేసు కొట్టేయడంతో రిషితేశ్వరి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

అన్ని ఆధారాలు సమర్పించాం.. అయినా కేసు కొట్టేశారు..

తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం.. హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తాం.. పోలీసులు అప్పీలు చేయాలి : స్పెషల్‌ పీపీ 

నిందితులపై నేరాన్ని నిరూపించలేకపోయిన ప్రాసిక్యూషన్‌ 

రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు తీర్పు  

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఏఎన్‌యూలో బ్యాచిలర్‌ ఆఫ్‌ అర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) చదువుతూ, 2015 జూలై 14న బాలికల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్, వేధింపులవల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు అప్పట్లో పెదకాకాని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులపై మోపిన నేరాన్ని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టేస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమా తీర్పు వెలువరించారు. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం: ‘కోర్టు తీర్పుతో మా ఆశలు చచ్చిపోయాయి. మాకు పూడ్చలేని బాధను మిగిల్చారు. న్యాయం జరుగుతుందని తొమ్మిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాం. సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టేశామని చెప్పడం ఎంతో బాధగా ఉంది. మా కుమార్తె తన డైరీని స్వయంగా రాసింది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా రిషితేశ్వరినే రాసిందని తేల్చిచెప్పింది. అయినా మా కుమార్తెకు అన్యాయం జరిగింది. ఇందులో 170 మంది సాక్షులున్నారు. కానీ, ఏ ఒక్కరూ వారికి కని పించలేదు. మాకింక దిక్కెవరు? గంగలో దూకడమే శరణ్యం. పాప రాసిన డైరీలను ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదో అర్థంకావడంలేదు. గతంలో సీఎం చంద్రబాబు, గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీకి డైరీ కాపీలు అందజేసినా పరిగణలోకి తీసుకోలేదు’.. ఆచార్య నాగార్జున వర్సిటీ బీఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు అనంతరం మృతురాలి తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ ఆవేదన ఇది. తీర్పు వెలువడగానే కోర్టు ప్రాంగణంలో కన్నీరుమున్నీరైన వారిని చూసి అందరి గుండెలు బరువెక్కాయి.

కేసు పూర్వాపరాలు..
రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి కారణమైన వర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.బాబు రావుతోపాటు వర్సిటీ ఉన్నతాధికారులపై కేసు న మోదు చేయాలని, ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజా, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేశాయి. చంద్రబాబు నిర్లక్ష్యం వీడాలని అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి.. ఈ పోరాటాల ఫలితంగా టీడీపీ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ప్రిన్సిపాల్‌ బాబురావుపై చర్యలు తీసుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం విచారణ జరిగిన అనంతరం శుక్రవారం గుంటూరు కోర్టు కేసును కొట్టివేసింది. 

అన్నీ సమర్పించాం, అప్పీలుకు వెళ్లాలి..
రిషితేశ్వరి డైరీల్లో ఎవరెవరు ర్యాగింగ్‌కు పాల్ప­డ్డారు, మానసికంగా వేధించిన వారి పేర్లు స్పష్టంగా ఉ న్నాయి. ఈ తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం. హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తాం. పోలీసులు  అప్పీల్‌ చేయాలి. – వై.కోటేశ్వరరావు, స్పెషల్‌ పీపీ

గుండెఘోషకు రిషితేశ్వరి అక్షర రూపం ఇదే..
రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఆమె గదిలో డైరీ లభించింది. అందులో రిషితేశ్వరి స్వహస్తాలతో రాసుకున్న కొన్ని ఘటనలు, తాను ఎదుర్కొన్న ఆవేదన, గుండెఘోషను కూలంకషంగా అక్షర రూపంలో వివరించింది. ‘మై లాస్ట్‌ నోట్‌’ పేరుతో తన స్వహస్తాలతో రిషితేశ్వరి రాసిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..

నవ్వు!!! నవ్వు!!! నవ్వు!!! ఈ నవ్వు అంటే 
నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటా. అందరిని నవ్విస్తూ ఉంటా. కానీ, ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.
 మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచాడు మా నాన్న. నాకు చదువు అంటే ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వదిలి ఇక్కడకొచ్చా. 
ఇలా వచ్చిన నన్ను.. నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమవైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. అది వింటేనే నా మొహంలో నవ్వు మాయమై పోయేది.. ఏడుపు కూడా వచ్చేది.

నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు.. కాని ఇక్కడకు వచ్చాక చెబితే ఏమైపోతారో అని దాయాల్సి వస్తోంది. నాకు నరకయాతన కనిపిస్తోంది. 
నా ఆఖరి కోరిక ఒక్కటే. నా చావుకు కారణం ఎవరో వాళ్లకు తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంకెవ్వరినీ ఇలా (నాలా) బాధపెట్టకుంటే చాలు.
 ఏ అమ్మాయిలూ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ ఉండదని అనుకోవద్దు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచవద్దు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక నరకం కనిపిస్తుంది.
 అమ్మా, నాన్న జాగ్రత్త! నాన్న ప్లీజ్‌ ఏడవకండి. నేను ఎప్పుడూ మీ దగ్గర్లోనే ఉంటా. ట్రై టూ డొనేట్‌ మై ఆర్గాన్స్‌ ఇఫ్‌ దే ఆర్‌ ఇన్‌ గుడ్‌ కండీషన్‌.. (నా అవయవాలు పనిచేసే స్థితిలో ఉంటే వాటిని దానం చేయడానికి ప్రయత్నించండి) అంటూ చాలా అంశాలు రాసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement