తాళపత్రాల్లోని విజ్ఞానం భావితరాలకు అందాలి | Research on digitization of Talapatra documents is commendable | Sakshi
Sakshi News home page

తాళపత్రాల్లోని విజ్ఞానం భావితరాలకు అందాలి

Published Thu, Mar 28 2024 4:50 AM | Last Updated on Thu, Mar 28 2024 4:50 AM

Research on digitization of Talapatra documents is commendable - Sakshi

పురాతన న్యాయశాస్త్ర గ్రంథాల్లో విలువైన సమాచారం 

తాళపత్రాల డిజిటలైజేషన్, పరిశోధనలు అభినందనీయం 

వేదిక్‌ వర్సిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 

తిరుపతి సిటీ/తిరుమల: తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీని బుధవారం ఆయన సందర్శించి తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల పూర్వం మహర్షులు, రుషులు, మేధావులు అపారమైన విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను తాళపత్రాల్లో లిఖించారన్నారు. అటువంటి విజ్ఞానాన్ని సంరక్షించి, పరిశోధనలు చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

వేదిక్‌ వర్సిటీలో తాళపత్ర గ్రం«థాల సంరక్షణ, డిజిటలైజేషన్‌ చేయడం ప్రశంసనీయమన్నారు. పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల్లో చాలా విలువైన సమాచారం ఉందని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. పురాతన నాగరికతలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం, న్యాయవ్యవస్థల సమాచారం తాళపత్రాల్లో ఉండటం విశేషమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తాళపత్ర గ్రంథాలను సంరక్షించి, పరిశోధనలు, ప్రచురణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్‌ వర్సిటీ నడవడం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామమన్నారు. అనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో కలసి ఆయన వర్సిటీలోని వేద, వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ శాస్త్ర తాళపత్రగంథాల సంరక్షణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియను, ప్రచురణను పరిశీలించారు. అనంతరం వర్సిటీ, టీటీడీ అధికారులు సీజే దంపతులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు.

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి 
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉద­యం ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్ట్, హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తులకు టీటీడీ ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వా­గ­తం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్‌ అందజేశారు. 

సీజేఐని కలిసిన టీటీడీ చైర్మన్‌ 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తిరుమల పుష్పగి­రి మఠంలో జరిగిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యా­యమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ కుమారుడు భాను ప్రకాష్‌ వివాహానికి టీటీడీ చైర్మన్‌ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement