వారి రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలివ్వడం సాధ్యం కాదు
పోస్టులో ఉన్నంత వరకే వలంటీర్లపై మాకు అధికారం
రాజీనామా తరువాత ప్రైవేటు వ్యక్తులు అవుతారు
నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉంది
హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, అమరావతి: రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవ్వరినీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు.
వలంటీర్ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు.
ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 22 వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారు
ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు 929 మంది వలంటీర్లను తొలగించామన్నారు. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులిచ్చామని, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వారి రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇదెలా సాధ్యమని అన్నారు.
ఇప్పుడు వలంటీర్లు ఖాళీగా ఉన్నారు
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పగించలేదన్నారు. వారు ఖాళీగా ఉన్నారని, అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తూనే ఉన్నామన్నారు. దీని వల్ల ఖజానాపై భారం పడుతోందని వివరించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చన్నారు. వలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment