ఇలా ఇంటి వద్దకే పథకాలను తీసుకెళ్లడం మంచి పని
సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య
వలంటీర్లపై నిషేధం వ్యవహారంలో జోక్యానికి తిరస్కృతి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సంతృప్తికరమని వెల్లడి
సాక్షి, అమరావతి: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశంలో మరెక్కడా లేదని, ఇలా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం చాలా మంచి పని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించింది.
ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందచేసే ఏర్పాట్లు చేశామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తమ జోక్యం అవసరం లేదంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సచివాలయాల్లో క్యూలో నిల్చుకుని పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది
పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, కుంచెనపల్లి, మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల కారణంగా పెన్షనర్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిల్చుని పింఛన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. పక్షవాతం, కిడ్నీ తదితర రోగాలతో బాధపడే వారు పింఛను పొందలేని పరిస్థితి ఉందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రత్యామ్నాయల సంగతి ఏమిటని, దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమలవుతోందని ఆరా తీసింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని, ఇది మంచి పని అని వ్యాఖ్యానించింది.
► కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, తమ ఆదేశాల మేరకు పెన్షనర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు. వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మిగిలిన వారు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పొందేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు.
ఈ మేరకు ఈ నెల 2న మెమో జారీ చేసిందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సంతృప్తి చెందామని ధర్మాసనం తెలిపింది. అలా అయితే తాను లేవనెత్తిన అంశాలన్నింటినీ రికార్డ్ చేయాలని, తరువాత తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శివప్రసాద్‌రెడ్డి చెప్పారు.
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని శివప్రసాద్‌ను ధర్మాసనం కోరింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో పనిచేసే సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఎన్నికల సంఘం వద్ద పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
గతంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారని తెలిపారు. శివప్రసాద్ వాదనలు విన్న ధర్మాసనం.. పిల్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. దేశంలో మిగిలిన అన్ని చోట్లా ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరో ఐదుగురు కూడా పిటిషన్ దాఖలు చేశారని మరో న్యాయవాది చెప్పగా, ఆ వ్యాజ్యాన్ని కూడా కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment