వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి
సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
వలంటీర్ల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ
వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఈసీ ఉత్తర్వులిచ్చిందని వెల్లడి
సాక్షి, అమరావతి: వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి వల్ల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని తెలిపింది. వారి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. వారి విషయంలో స్పందించాల్సింది ఎన్నికల సంఘమేనని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. వలంటీర్ల నియామకం, తదితరాల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దిఖీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని, వారి ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తోందని అన్నారు. రాష్ట్ర ఖజానా నుంచే వీరికి గౌరవ వేతనం చెల్లిస్తోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, వలంటీర్ల వల్ల మంచే జరుగుతోంది కదా, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది.
వలంటీర్లు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నం మురళీధరరావు కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment