సాక్షి, అమరావతి: నిరుపేదలకు ఎంతో మేలు జరిగే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)పై విమర్శలు చేస్తున్న వారు పేదల వ్యతిరేకులని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇళ్లపై పేదలకు సంపూర్ణ హక్కులు దక్కడం కొందరికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం దీన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అమలు చేయకపోగా కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని, అలాంటి వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు మంచి స్పందన వస్తోందని, ఇప్పటివరకూ 5 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. ఏడాది మొత్తం అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు కాగా ఓటీఎస్ ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలపై సీఎం ఇలా మార్గనిర్దేశం చేశారు..
సంపూర్ణ అవగాహన కల్పించాలి
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. తొలుత సిబ్బంది, వలంటీర్లకు క్షుణ్నంగా వివరించి పథకం ప్రయోజనాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల మేర భారీ బకాయిలను మాఫీ చేస్తోంది. క్లియర్ టైటిల్ ఇస్తోంది. ఆస్తిని అమ్ముకునేందుకు లేదా తమవారికి బహుమతిగా ఇవ్వడానికి పూర్తి హక్కులు కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం దక్కుతుంది. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. చాలావరకు ఈ ఇళ్లు ఉన్న చోట రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంది. అంత మొత్తంపై రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నాం. ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల పేదలకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతోంది. ఇలా మొత్తం రూ.16 వేల కోట్ల దాకా పేదలకు ప్రయోజనం కలుగుతుంది. ఇక చంద్రబాబు హయాంలో అసలు, వడ్డీ చెల్లించిన వారు 43 వేల మంది ఉన్నారు. డబ్బులు కట్టినా వారికి ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఇప్పుడు వారందరికీ మేం ఉచితంగా ఇస్తాం. ఈ అంశాలను లబ్ధిదారులకు క్షుణ్నంగా చెప్పాలి. వీటన్నిటిపై అవగాహన కల్పించి ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందేలా చూడాలి.
ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం
పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెద్ద ఊరట లభించింది. హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. సిమెంట్, స్టీల్ ఇతరత్రా కొనుగోళ్లతోపాటు స్థానికులకు పనులు లభిస్తాయి. ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం. బిల్లులు పెండింగ్ లేకుండా అన్నింటినీ చెల్లించాం.
జనవరి 31 కల్లా అన్నీ మొదలవ్వాలి
మంజూరు చేసిన ప్రతి ఇంటి నిర్మాణం కొనసాగేలా చూడాలి. జనవరి 31 కల్లా అన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కావాలి. బేస్‌మెంట్ స్థాయిని దాటి ముందుకెళ్లాలి. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణానికి 20 మంది లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు ముమ్మరం చేయాలి. జనవరి 31 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తై ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. కలెక్టర్లు, జేసీలు, మున్సిపల్ కమిషనర్లు ఇళ్ల నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. గతంలోనే చెప్పిన విధంగా కలెక్టర్ ప్రతివారం ఒక లేఅవుట్‌ను పరిశీలించాలి. జేసీ (రెవిన్యూ, డెవలప్‌మెంట్, ఆసరా) వారానికి ఒకసారి, హౌసింగ్ జేసీలు, ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు వారానికి నాలుగు సార్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించాలి.
వ్యయాన్ని నియంత్రించాలి..
ఇళ్ల నిర్మాణ ఖర్చును తగ్గించడంతో పాటు వ్యయాన్ని నియంత్రణలో ఉంచాలి. లేఅవుట్ల పరిధిలోనే ఇటుకల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. సిమెంట్‌ను సబ్సిడీ ధరకు అందిస్తున్నాం. స్టీల్‌ను కూడా సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తున్నాం. మెటల్ ధరలపై కలెక్టర్ల నియంత్రణ ఉండాలి.
లబ్ధిదారులకు పావలా వడ్డీకే రుణాలు
ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే రుణాలు అందించాలని సూచించాం. దీనిపై బ్యాంకర్లతో కలెక్టర్లు రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలి. సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇళ్ల నిర్మాణ నాణ్యత బాగుండేలా చూడాలి. ఇళ్లు నిర్మించే కాలనీల్లో నీటి సరఫరా కచ్చితంగా ఉండాలి. వీలైనంత మేర ఇసుక రీచ్‌లను తెరిచి అందుబాటులోకి తేవాలి. పెద్ద లేఅవుట్లలో మెటీరియల్‌ను నిల్వ చేసేందుకు గోడౌన్లను ఏర్పాటు చేయాలి. ఇళ్ల నిర్మాణంపై సచివాలయాల నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ ప్రతి వారం సమావేశాలు జరగాలి.
మధ్య తరగతికి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్
మధ్య తరగతి ప్రజల కోసం వీటిని తీసుకొస్తున్నాం. వివాదాలు లేని ప్లాట్లను సరసమైన ధరలకే వారికి అందిస్తాం. ఆ లేఅవుట్లలో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తాం. ప్లాట్లు కేటాయించిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేపడతారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం వస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి భూ సేకరణపై దృష్టి సారించాలి.
అర్హులందరికీ ఇంటి పట్టాలు..
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా అందాలి. ఇప్పటివరకూ అందిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తించారు. డిసెంబర్ 28న వివిధ కార్యక్రమాలు, పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ప్రయోజనాలను అందిస్తున్నాం. ఏటా రెండు సార్లు ఇలా చేస్తున్నాం. లబ్ధిదారులుగా గుర్తించిన వారికి, అందుబాటులో ఇళ్లస్థలాలు ఉన్నవారికి అదేరోజు పట్టాలివ్వాలి. మిగిలిన వారి కోసం కూడా అవసరమైన భూములను సేకరించండి. ల్యాండ్ స్వాపింగ్ ఆప్షన్‌ను కలెక్టర్లు వినియోగించాలి. అవసరమైన చోట భూమి సేకరించాలి. వీరికి జనవరి నెలాఖరులోగా పట్టాలు అందించేలా చర్యలు తీసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment