Rural Industries Are Encouraged By The AP Government - Sakshi
Sakshi News home page

గ్రామీణ పరిశ్రమలకు ఏపీ సర్కారు ఊతం 

Published Tue, Dec 28 2021 10:49 AM | Last Updated on Tue, Dec 28 2021 3:16 PM

Rural Industries Are Encouraged By The AP Government - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామాల్లో విద్యుత్‌ పంపిణీ సంస్థల ద్వారా కొత్తగా త్రీ ఫేజ్‌ విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది జూలైలోగా పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా.. అవసరమైతే కొంత గడువు పొడిగించి సంబంధిత గ్రామాలన్నిటిలోనూ విద్యుత్‌ లైన్లు వేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రోత్సాహమిస్తున్నారు.

చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు

మొదలైన కొత్త లైన్ల ఏర్పాటు 
వ్యవసాయోత్పత్తులకు మంచి ధర కల్పించేలా ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం తర్వాత ఈ రంగం అతిపెద్ద ఉపాధి వనరుగా మారడంతో మెరుగైన ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం దీనికి ప్రాధాన్యతనిస్తోంది. ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లను నిర్వహించే రైతులకు తక్కువ ధరకే విద్యుత్‌ అందిస్తారు. ఇందుకు అనుగుణంగా గ్రామీణ కుటీర పరిశ్రమలకు కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు.

గ్రామాల్లో ప్రస్తుతం వ్యవసాయ బోర్లకు 3 ఫేజ్‌ విద్యుత్‌ను 9 గంటల పాటు అందిస్తున్నారు. మిగతా సర్వీసులకు సింగిల్‌ ఫేజ్‌ ఇస్తున్నారు. అయితే కుటీర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేకంగా త్రీ ఫేజ్‌ లైన్లు వేయాల్సి వస్తోంది. దీనికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అవుతోంది. పైగా యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు డిస్కంలు కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నాయి. 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి గ్రామాలకు 11 కేవీ విద్యుత్‌ లైన్లు, అల్యూమినియం కండక్టర్లు, 110 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లతో నేరుగా లైన్లు వేస్తున్నాయి.

ఈపీడీసీఎల్‌ పరిధిలో 123 గ్రామాలు 
తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 123 గ్రామాలను సర్వే ద్వారా గుర్తించాం. వీటిలో 3 ఫేజ్‌ విద్యుత్‌ లైన్లు వేసేందుకు రూ.44 కోట్లు వెచ్చిస్తున్నాం. 
– కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్‌

సీపీడీసీఎల్‌ పరిధిలో రూ.60 కోట్లతో.. 
ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్‌) పరిధిలోని విజయవాడలో 31, సీఆర్‌డీఏ పరిధిలో 10, గుంటూరు జిల్లాలో 30, ప్రకాశం జిల్లాలో 34 గ్రామాలను గుర్తించాం. ఈ 105 గ్రామాల్లో రూ.60 కోట్లతో లైన్లు వేస్తున్నాం. 
– జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్‌ 

ఎస్పీడీసీఎల్‌ పరిధిలోనూ కొత్త లైన్లు 
దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్‌) పరిధిలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 112 గ్రామాల్లో త్రీ ఫేజ్‌ విద్యుత్‌ లైన్లు వేయాలని నిర్ణయించాం. ఇప్పటికే 32 గ్రామాలకు లైన్లు వేశాం. 80 గ్రామాలకు పనులు జరుగుతున్నాయి. ఈ మొత్తం పనులకు రూ.65.19 కోట్లు ఖర్చవుతోంది. 
– హెచ్‌.హరనాథరావు, సీఎండీ, ఎస్పీడీసీఎల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement