
అనకాపల్లి జిల్లా సరిపల్లి ఆర్బీకే పరిధిలో నాట్లు వేస్తున్న రైతుకు సూచనలు చేస్తున్న ఆర్బీకే సిబ్బంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపర్చడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం, సేవల్లో నాణ్యత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లో 14,287 మంది సేవలందిస్తున్నారు. వీరు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. వీరితోపాటు మండల స్థాయిలో పనిచేసే 670 మంది వ్యవసాయాధికారులు, 154 అసిస్టెంట్ డైరెక్టర్ల పనితీరునూ అంచనా వేసేందుకు ప్రత్యేకంగా వైఎస్సార్ యాప్ (ఈల్డ్ సస్టైనబులిటీ రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ)ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్బీకే సిబ్బంది పనితీరును మెరుగుపర్చేందుకు ఏర్పాటుచేసిన ఈ యాప్‌ను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కూడా వర్తింపజేస్తున్నారు.
యాప్‌తో నిఘా ఇలా..
ఈ వైఎస్సార్ యాప్.. సిబ్బంది, అధికారుల పనితీరును అంచనా వేయడమే కాక.. వారు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో రికార్డుచేసే నిఘా వ్యవస్థలా పనిచేస్తుంది.
► ఆర్బీకే ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది.
► సిబ్బంది ఆర్బీకేలో ఎంతసేపు ఉన్నారు? ఫీల్డ్‌లో ఎంతసేపు ఉన్నారు? అనేది ట్రాకర్ ద్వారా రికార్డు అవుతుంది.
► ఆర్బీకే సిబ్బంది, సబ్ డివిజన్ పరిధిలో ఏడీఏలు, ఎంఏఓలు ఈ యావ్ ద్వారా నిర్ణీత సమయంలోనే హాజరు (జియో పంచ్) నమోదుచేయాలి.
► విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీతో పాటు ఇతర రైతు సేవలకు సంబంధించిన ప్రత్యేక నోటిఫికేషన్లను వీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
► మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వచ్చే రోజువారీ టాస్క్‌లకు సమయానుకూలంగా స్పందించాలి.
► క్రమం తప్పకుండా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహిస్తూ వాటిని అప్‌లోడ్ చేయాలి.
► ప్రతీరోజు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం, సాగులో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలిస్తూ వారికి అందుబాటులో ఉండాలి.
► ఎప్పటికప్పుడు వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
► ఇదే రీతిలో ఎంఏఓలు, ఏడీఎల పనితీరును కూడా ఈ యాప్ ద్వారానే క్రోడీకరిస్తూ అంచనా వేస్తుంటారు.
పనితీరుకు మార్కులు ఇలా..
రోజువారీ టాస్క్‌లకు అందరికంటే వేగంగా స్పందించే ఆర్బీకే సిబ్బందికి 60 మార్కులు.. 100 శాతం హాజరు కనబర్చిన వారికి 40 మార్కులు ఇస్తారు. ఇక ఎంఏఓలకు.. ఆర్బీకేలను విజిట్‌చేస్తే 40 మార్కులు, వ్యక్తిగతంగా ఇచ్చే టాస్క్‌లను çపూర్తిచేస్తే 20 మార్కులు, తన పరిధిలోని ఆర్బీకేల పనితీరు ఆధారంగా 20 మార్కులు, అటెండెన్స్‌కు 20 మార్కులు ఇస్తారు. ఏడీఏలకు అయితే.. టాస్క్‌లకు 40 మార్కులు, వీరికింద పనిచేసే ఎంఏఓల పనితీరు ఆధారంగా 40 మార్కులు, అటెండెన్స్‌కు 20 మార్కులు చొప్పున ఇస్తారు. యాప్ ద్వారా అంచనా వేసిన పనితీరు ఆధారంగా 95కు పైగా మార్కులొస్తే అత్యుత్తమ (ఎక్స్‌లెంట్), 75–95 మధ్య మార్కులొస్తే ఉత్తమ (గుడ్), 50–75 మధ్య మార్కులొస్తే సాధారణం (ఫెయిర్), 50 మార్కుల్లోపు వస్తే బాగోలేదు (పూర్) అనే కేటగిరీలుగా విభజించి వారి పనితీరును బేరీజు వేస్తారు. అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారి ఫొటోలను ‘వైఎస్సార్ రైతుభరోసా’ మాసపత్రికల్లో ప్రచురిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
12 సార్లు బెస్ట్‌పెర్ఫార్మర్‌గా నిలిచా
రైతులకు సేవచేయడం మహద్భాగ్యంగా పనిచేస్తున్నాం. మా పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. హాజరు నమోదు, నోటిఫికేషన్స్‌కు స్పందించడం, ఇచ్చిన టాస్క్‌లు పూర్తిచేసిన వారికి మార్కులు ఇస్తున్నారు. దీనివల్ల సిబ్బందిలో పోటీతత్వం పెరుగుతుంది. గడిచిన ఏడాదిన్నరలో 12 సార్లు ది బెస్ట్ పెర్‌ఫార్మర్‌గా నిలిచాను.
– ఎ.నాగసునీల్‌కుమార్, ఉద్యాన సహాయకుడు, యర్రగుడిదిన్నె ఆర్బీకే ఇన్‌చార్జి, నంద్యాల జిల్లా
పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యం
ఆర్బీకే సిబ్బంది పనితీరు మెరుగుపర్చడం ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వైఎస్సార్ యాప్ ద్వారా సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తాం. ప్రస్తుతం 50 శాతం మంది ఉత్తమ, అత్యుత్తమ పనితీరును కనపరుస్తున్నారు. మిగిలిన వారినీ ఇదే రీతిలో తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం.
– వల్లూరి శ్రీధర్, జేడీఏ, ఆర్బీకే విభాగం