సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రజలతో మరింతగా మమేకమవడం వంటి అంశాలే అజెండాగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడాన్ని సీఎం వైఎస్ జగన్ బాధ్యతగా భావిస్తున్నారన్నారు. ఆయనలాగే ఆయన టీమ్ కూడా ప్రజలకు సేవ చేయడం, నిత్యం అందుబాటులో ఉండటం, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా పనిచేయాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం పార్టీలో జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించారన్నారు.
చెప్పిన దాని కంటే మిన్నగా
మూడేళ్లలో అందరూ అనుకున్నదానికంటే, మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామ, వార్డు సచివాలయాలు, డీబీటీ సిస్టమ్ ఇలా అనేక సంస్కరణలు తెచ్చారని, పారదర్శకతకు పెద్దపీట వేశారని అన్నారు. సంక్షేమం అంటే ఒక్క రోజు తాయిలాలు ఇవ్వడం కాకుండా భవిష్యత్తు మార్చేలా, భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోందని చెప్పారు. లేనిది ఉన్నట్టుగా ప్రతిపక్షం గోబెల్స్ ప్రచారం చేస్తోందని, దాన్ని తిప్పికొట్టి, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు తెలియజెప్పడం పార్టీ ప్రధాన కర్తవ్యమని తెలిపారు.
గడపగడపకూ వెళ్లి
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను కోరేందుకు సమయం వచ్చిందని తెలిపారు. ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్ ఈ అంశంపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. గడప గడపకూ కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి గడపకూ రెండు, మూడు సార్లు వెళ్లాలని, ప్రభుత్వం చేసిన మంచి చెప్పడంతో పాటు లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారన్నారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ కార్యాచరణలో ఒక భాగమన్నారు. ఈ కార్యక్రమాలను పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పారు. ప్రతిపక్షం కొందరిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
మానవీయ కోణంలో స్పందన
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. లక్షలాది ఉద్యోగులు, కోట్లాది మందికి సేవ చేసే చోట ఎక్కడో ఒక వ్యవస్థకు సంబంధం లేకుండా పొరపాటున చిన్న తప్పులు జరుగుతుంటాయని అన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం అంటే ఫస్ట్ మార్కు సీఎం వైఎస్ జగన్‌కే వస్తుందని చెప్పారు. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు స్పందన లేనందువల్లే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి గత ప్రభుత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ఏ సమస్యపైనైనా వైఎస్ జగన్ ప్రభుత్వం మానవీయ కోణంలో బాధ్యతగా స్పందిస్తుందని, అందుకే మొత్తం వ్యవస్థ కదులుతోందని, సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment