
సాక్షి,అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నూతన కార్యవర్గం గురువారం తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు.
అనంతరం సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే, కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. వాటి ఉచ్చులో పడొద్దని ఉద్యోగులకు ఆయన సూచించారు. సజ్జలను కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, నూతన అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.కృపావరం, కోశాధికారి ఎం.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, ప్రసాద్‌యాదవ్ తదితరులున్నారు.