
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం ద్వారా పేదలు లబ్ధి పొంది, అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కృష్ణబలిజ, పూసల కులస్తుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల్లోని ప్రతి బిడ్డా.. సంపన్న వర్గాల పిల్లలకు పోటీగా విద్యనభ్యసించాలనేది సీఎం జగన్ ఆశయమని చెప్పారు.
ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో బీసీలు రాణించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కోలా భవాని మణికంఠ, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, కృష్ణబలిజ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోలా అశోక్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశం వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కోలా మణికంఠ, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొదిలి కదిరయ్య పాల్గొన్నారు.