‘దార్శనిక నేత డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు
సాక్షి, అమరావతి: బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఊపిరిపోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాజ్యాధికారంలో దళిత, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రతీ క్షణం వారి పక్షమేనని రుజువు చేస్తున్నారని తెలిపారు. జగ్జీవన్‌రామ్ 113వ జయంతి కార్యక్రమం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగింది. పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సజ్జల మాట్లాడుతూ... కులాలకతీతంగా పేదరికాన్ని పారదోలాలని జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ తలపెట్టిన యజ్ఞాన్ని సీఎం జగన్ మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఆయన ఇంకేమన్నారంటే...
దళితులకు సమాన అవకాశాలు
‘‘భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మహనీయులు గొప్ప దార్శనికత చూపారు. కానీ 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థ ఆ మహా సంకల్పాన్ని అరకొరగానే అమలు చేసింది. ఇన్నేళ్లయినా కొన్ని వర్గాలు ఆర్థిక, సామాజిక సమానత్వం పొందలేదన్నది చేదు వాస్తవమే. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చిన 21 నెలల్లోనే జగ్జీవన్ రామ్ ఆశయాలకు ఊపిరి పోశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. దళితులకు అన్ని చోట్లా సమాన అవకాశాలు ఇవ్వడంలో జగన్ తనకు తానే సాటి అన్పించుకున్నారు. సమాజంలో అణచివేతకు గురైన మహిళలను పైకి తేవాలనేది ఆయన తలంపు. మునిసిపల్ ఎన్నికల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలకే అవకాశం కల్పించారు.
నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇదే ఒరవడి కొనసాగించారు. రాబోయే కాలంలోనూ ఇదే కొనసాగుతుంది. అందుకే సీఎం వైఎస్ జగన్‌ను కొత్తతరం నేతగా ప్రజలు గుర్తిస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు. నూతక్కి అశోక్‌కుమార్ రచించిన ‘దార్శనిక నేత డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ దళితులు ఎదగాలని సీఎం జగన్ కోరుకుంటున్నారన్నారు. తనలాంటి నిరుపేద దళితుడిని ఎంపీని చేయడం అందుకు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి, నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment