
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ తీరులో కీలక అంశాలు విస్మరించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వాటినే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. తాము అడిగిన నాలుగు ప్రశ్నలకు చంద్రబాబు, సీబీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మీడియాతో మాట్లాడారు. వివేకా లేఖ సాయంత్రం వరకు ఎందుకు బయటకు రాలేదని, గుండెపోటు అని చెప్పింది ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారని, వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కథలు అల్లి సీఎం జగన్‌ను ఎలా ఇరికించాలా అని ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు.
ఎటువంటి అంశాలపైనైనా రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. వివేకా హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బాబు అబద్ధాన్ని ఎల్లో మీడియా వండి ప్రజల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ చార్జిషీటులో పచ్చి అబద్ధాలు వండివార్చిందన్నారు. చార్జిషీటు ఆధారంగా అవినాష్‌రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు తీర్మానమా? అని ప్రశ్నించారు.
మొదటి నుంచి కుట్రల స్వభావం ఉన్న చంద్రబాబు.. వివేకా కేసులో రోజూ నీచమైన ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎదురుగా ఉన్న సాక్ష్యాలను సీబీఐ పరిగణలోకి తీసుకోదా? అని అడిగారు. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలన్నారు. ప్రజలే సరైన సమయంలో బాబుకు శిక్ష వేస్తారని చెప్పారు. గౌతమ్‌రెడ్డి మరణంపై కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి చంద్రబాబుదన్నారు. విచారణలో తమను ఇరికించాలని చంద్రబాబు, పచ్చమీడియా విశ్వప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment