Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Over YS Vivekananda Reddy Murder Case - Sakshi
Sakshi News home page

ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననం

Published Wed, Mar 2 2022 3:34 AM | Last Updated on Wed, Mar 2 2022 11:14 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Conspiracy - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల మన్ననలు చూరగొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌ హఠాన్మరణం అనంతరం వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా మొగ్గలోనే తుంచి వేయాలనే కక్షతో కాంగ్రెస్‌తో కలసి హైకోర్టులో తప్పుడు కేసులు, సీబీఐ దర్యాప్తు చేయించినా ఏమీ చేయలేక పోయారన్నారు. ప్రజాకోర్టులో చిత్తుగా ఓడిపోయినా చంద్రబాబు గుణపాఠం నేర్చుకోకుండా మూడేళ్లుగా అవే కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.

సునీతమ్మ, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ద్వారా వైఎస్‌ వివేకా హత్య కేసులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా కలసి ఆడుతున్న నాటకంలో వారు పాత్రధారులుగా మారడంతో వైఎస్‌ వివేకా ఆత్మ క్షోభిస్తోందన్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సునీతమ్మ పోటీ చేస్తారని కొన్ని పత్రికల్లో కథనాలు రావడంపై స్పందిస్తూ.. ఆ పార్టీలో చేరాలనుకుంటే చేరవచ్చని, అయితే వ్యక్తిత్వ హననం సరి కాదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

జగన్, అవినాష్‌ గెలుపు కోసం వివేకా కృషి
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై కొద్ది నెలలుగా చంద్రబాబు, టీడీపీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 అవాకులు చవాకులు పేలుతున్నాయి. సీబీఐ విచారణ ప్రారంభమయ్యాక 2020 మార్చి తర్వాత దర్యాప్తు రెండు మూడు నెలలు ఒక పద్ధతిలో సాగింది. అనంతరం పూర్తిగా దారి మళ్లింది. ఒక్కసారిగా మా పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈ హత్యలో ప్రమేయమున్నట్లు ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎంను చేయడం కోసం, వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కడప ఎంపీగా గెలిపించడం కోసం వైఎస్‌ వివేకా కృషి చేయడం వాస్తవం. వైఎస్‌ అవినాష్‌రెడ్డితో సహా మేమంతా అత్యంత గౌరవించే కుటుంబంలో భాగమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదని ఇన్నాళ్లూ భావించినా ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. 

ఆది నుంచి అక్కసే..
వైఎస్‌ కుటుంబంపై చంద్రబాబు ఆది నుంచి రకరకాల దుష్ప్రచారాలు చేశారు. 1999 తర్వాత సూట్‌కేసు బాంబు కేసు, అంతకు ముందు రాజారెడ్డి హత్య కేసు, వైఎస్సార్‌ అక్రమ మైనింగ్‌ చేశారంటూ ప్రచారాలు చేశారు. ఇప్పుడు వివేకా హత్య కేసులోనూ శూన్యం నుంచి ఏదో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో అన్ని దుర్మార్గాలకు చంద్రబాబు ప్రతిరూపం.

పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం లీకులిచ్చి..
వివేకా హత్య కేసును చివరకు సీఎం వైఎస్‌ జగన్‌కు ఆపాదించేలా స్క్రిప్ట్‌ తయారు చేస్తున్నారు. సీబీఐ రూపొందించిన సీఆర్పీసీ–161 నివేదికను చూస్తే ఆ విషయం బోధపడుతుంది. సాక్షులు స్పష్టంగా చెప్పినట్లు లేకపోయినా వాంగ్మూలాల పేరుతో ఈనాడు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5లకు లీకులిచ్చి రోజూ ప్రచారంలోకి తేవడం, 
టీడీపీ నేతల దుష్ఫ్రచారం, ఆ తర్వాత ట్వీట్లను పరిశీలిస్తే ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
 
బాబు చేతిలో పావుల మాదిరిగా..
వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలాలు బయటకు వచ్చాక, వారు ఏ విధమైన జంకు లేకుండా వైఎస్‌ అవినాష్‌ వైపు వేలు చూపిన తర్వాత ఇది వ్యక్తిగతమైందని మేం అనుకోవడం లేదు. అందుకే మౌనంగా ఉండకూడదని మాట్లాడుతున్నాం. చంద్రబాబు చేతిలో సునీతమ్మ, రాజశేఖరరెడ్డి పావులుగా మారారో లేక సూత్రధారులో తెలియదుగానీ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారు. మేం అడిగిన ఐదు ప్రశ్నలకు మాత్రం జవాబు ఇవ్వట్లేదు. వీటన్నిటికీ సీఎం జగన్‌ సమాధానం చెప్పలేక కాదు. తమ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే ఆయన స్పందించలేదు. 

వాంగ్మూలాల్లో వాస్తవం ఎంత?
సీబీఐ వాంగ్మూలాలు, సునీతమ్మ మాట్లాడిందంటూ ఓ వర్గం మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు. సాక్షులు చెప్పనివి కూడా రాస్తూ సాగదీస్తున్నారు. వాటిని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇష్టానుసారంగా ప్రచురిస్తున్నారు. 

కోడికత్తి వ్యంగ్య భాష ఎవరిది?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి దాడి జరిగిందని, ఆయనకు చికిత్స పేరుతో సహాయం చేసిన వారికి తరువాత మంచి పదవులు దక్కాయని సునీతమ్మ, ఆమె భర్త రాజశేఖరరెడ్డి పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతిలో కథనం రాశారు. కానీ వాంగ్మూలంలో అది కనిపించలేదు. హత్య ముందురోజు జమ్మలమడుగు వెళ్లి వచ్చిన వైఎస్‌ వివేకా తానే ఎంపీ అని అన్నట్లు, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు రాశారు. అది కూడా వాంగ్మూలంలో కనిపించలేదు. విచారణ సందర్భంగా ఎవరైనా రాజకీయంగా మాట్లాడితే సీబీఐ యథావిథిగా నోట్‌ చేస్తుందా? కోడికత్తి అని చెబితే అలాగే రాసుకుంటుందా? నిజానికి వ్యంగ్యంగా ఆ మాట అన్నది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా? వైఎస్‌ వివేకా హత్య తర్వాత సాయంత్రం వరకు అక్కడ ఉన్న లేఖను బయటపెట్టలేదు. ఆ ప్రస్తావనే ఛార్జ్‌షీట్‌లో లేదు. అంత దారుణంగా సీబీఐ ఛార్జ్‌షీట్‌ ఉంది. 

హతమార్చేందుకేనని తేల్చిన ఎన్‌ఐఏ
వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగా పాదయాత్ర సమయంలో ఆయన్ను హత్య చేసేందుకే విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కేసును సమగ్రంగా విచారించిన అనంతరం ఎన్‌ఐఏ ఆ విషయాన్ని నిర్ధారించింది. నిందితుడు వినియోగించిన కత్తితో మెడపై దాడి చేసి సులభంగా హత్య చేయవచ్చని ఎన్‌ఐఏ దర్యాప్తులో నిగ్గు తేల్చింది. వైద్య నిపుణులూ అదే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో పటిష్ట భద్రత కలిగిన విమానాశ్రయంలో దాడికి పాల్పడటం చిన్న విషయం కాదు. అక్కడ టీడీపీ నేత నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లోనే నిందితుడు పని చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి, రాజకీయ ప్రలోభాలకు గురై నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఎర్ర గంగిరెడ్డిని జైలులో ఎందుకు కలిశారు?
వేలిముద్రలు దొరక్కుండా రక్తపు మరకలు తుడిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డిని జైలులో సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి ఎందుకు కలిశారు?
 
నాడు రచ్చకీడ్చి నేడు బుజ్జగింపు..
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 2019 మార్చి 17న కొత్తపలుకు పేరుతో రాసిన కథనంలో వైఎస్‌ వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని, ఆమె అర్ధరాత్రి ఫోన్‌ చేసిందని, వైఎస్‌ వివేకాది హత్య అని తెలిసినా సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రాసుకొచ్చారు. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారు. వారి ఫోటోలూ ప్రచురించారు. ఇవాళ వివేకా కుమార్తె, అల్లుడిని చేరదీస్తున్నారు. 

నిందితుడే అప్రూవరా?
హత్యకు సంబంధించి దస్తగిరి చెప్పిన మాటలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఎవరెవరు పాల్గొన్నారో వెల్లడించాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాంగ్మూలాలు సీఆర్పీసీ–161 కింద పరిగణించరని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిందితుడిని అప్రూవర్‌గా మార్చడం చాలా అరుదని పేర్కొంటున్నారు.

అప్పటి నుంచే సంబంధాలున్నాయా?
సీఎం వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసును దారి మళ్లిçస్తూ వివేకా కుమార్తె,  అల్లుడిని చంద్రబాబు తమవైపు తిప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. నిజానికి ఆ హత్య జరిగినప్పటి నుంచే వారి మధ్య సంబంధాలు ఉన్నాయా? అనిపిస్తోంది. ఎందుకంటే.. అక్కడ దొరికిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదు? ఆ వి«షయాన్ని శివప్రసాద్‌రెడ్డి ఎంపీ అవినాష్‌రెడ్డికి చెప్పకపోవడం తప్పు కాదా?

గౌరవం ఉంది కాబట్టే..
సీఎం వైఎస్‌ జగన్‌కు తమ కుటుంబ సభ్యుల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరుకున్నారు. అయితే నిందితులను కాపాడాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ కేసు ప్రభావితం కారాదని, న్యాయబద్ధంగా దర్యాప్తు జరగాలని సీఎం జగన్‌ కోరుకున్నారు. ఎక్కడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదు. నిజానికి అప్పటి కాల్‌ రికార్డులు చూస్తే అన్నీ బయటపడతాయి. దస్తగిరి కోసం లాయర్‌ను ఎవరు నియమించారన్నదీ తెలుస్తుంది. నిజానికి ఈ కేసును పోలీసులు కూడా ఛేదించే వారు. కానీ సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ కేసును విచారిస్తే బాగుంటుందని సీఎం జగన్‌ భావించారు. చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వబోనని అనలేదా?

అంతా మర్చిపోయి..
వైఎస్‌ వివేకాను 2017లో ఎమ్మెల్సీగా జగన్‌ నిలబెట్టారు. నాడు వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నా టీడీపీ కుట్ర చేసి ఓడించింది. అవన్నీ మర్చిపోయి సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి ఇవాళ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 

సిట్‌ దర్యాప్తును ఎందుకు పక్కన పెట్టారు?
2020 మార్చి వరకు సిట్‌ జరిపిన దర్యాప్తును ఎందుకు పట్టించుకోవడం లేదు? సీబీఐ దాన్ని పూర్తిగా పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటి? ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది. కాల్‌ రికార్డులు పరిశీలిస్తే అన్నీ బయటకు వస్తాయి కదా?   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement