సాక్షి, అమరావతి: ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్సీ అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అధికారం కోసమే రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే వచ్చానని సీఎం జగన్ పదేపదే చెప్తుంటారని, ఆ మాటలను ఆయన నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం 20 శాతం ఐఆర్ ప్రకటిస్తే అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చి ఉద్యోగుల పక్షపాతిగా ఆనాడే నిలిచిపోయారని సజ్జల తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అన్నీ చూసుకునే సీఎం జగన్ ఈరోజు పీఆర్సీ ప్రకటన చేశారన్నారు. చెప్పిన దానికన్నా ఎక్కువ చేయాలని సీఎం జగన్‌కు ఉన్నా, పరిస్థితులు అనుకూలించలేదని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఊహించని రీతిలో కోవిడ్ వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్ధితి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. కరోనా వల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని చెప్పారు. అయినా ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయడంలో సీఎం ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పారు. ఉద్యోగుల విషయంలో ఏదో చెప్పేసి వదిలేయడం కాకుండా తర్వాత వచ్చే పరిస్ధితులకు బాధ్యత వహించాలని సీఎం భావించారన్నారు.
ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగంగా, తన కుటుంబ సభ్యులుగా సీఎం భావిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు గరిష్టంగా ఎంత చేయాలో సీఎం అంతా చేశారన్నారు. ఎవరూ అడక్కపోయినా రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారన్నారు. దీనివల్ల ఉద్యోగులకు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సర్వీసు రెండేళ్లు పెంచటం అనేది వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లాంటివారే చేయగలరని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, వారికి పర్మినెంట్ చేయాలన్నా ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమని చెప్పారు. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని, మరిన్ని ఉద్యోగాలకు జాబ్ కేలండర్ కూడా ప్లాన్ చేస్తున్నామని సజ్జల తెలిపారు. 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను ఏ ప్రభుత్వమూ ఇచ్చి ఉండదన్నారు.
వైద్య రంగంలో 40 వేల ఉద్యోగాలు సృష్టించి ఇచ్చామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలనూ సీఎం నెరవేర్చారని తెలిపారు. చేసేది ఏదైనా నిజాయితీగా, పారదర్శకంగా చేయాలన్నది జగన్ లక్ష్యమన్నారు. అందువల్లే 2014లో తాము ఎన్ని చెప్పినా, రుణమాఫీ లాంటి హామీలు ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబులా తప్పుడు హామీలు ఇవ్వడానికి జగన్ ఒప్పుకోరని చెప్పారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయాలని తాము ముందు నుంచీ కోరుతున్నామన్నారు. ఆయన రాజీనామా చేస్తేనే ఎవరేమిటో ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు చకోర పక్షిలాగా ఎంతగానో ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు వన్ సైడ్ లవ్ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అవసాన దశలో ఉన్న చంద్రబాబు పరిస్ధితి చూస్తే జాలేస్తోందన్నారు.
చదవండి: (ఫిట్‌మెంట్‌తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment