చంద్రబాబు, పవన్‌ను నిలదీసిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల
పవన్ కళ్యాణ్ రాయితో దాడి చేయించుకోగలరా? కత్తితో పొడిపించుకోగలరా?
సీఎం జగన్‌కు ప్రజాదరణ గతంలో కంటే మిన్నగా పెరిగింది
దీంతో విపక్షాలు వణుకుతున్నాయి
ఎన్నికల తర్వాత విపక్షాలకు పుట్టగతులుండవని భయపడుతున్నాయి
డ్రామాలాడే నైజం చంద్రబాబుదే
అలిపిరి ఘటన తర్వాత చేతికి కట్టుతో చంద్రబాబు ఆర్నెల్లు ప్రచారం చేసుకున్నారు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిని డ్రామా అంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. పవన్ తన అభిమానులతో రాయితో కొట్టించుకోగలరా? కత్తితో పొడిపించుకోగలరా? అని ప్రశి్నంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు వస్తున్న ప్రజా స్పందనను చూసి టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు వణికిపోతున్నాయని, ఎన్నికల తర్వాత వాటికి పుట్టగతులుండవని భయపడుతున్నాయని చెప్పారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై దాడి యాదృచి్ఛకంగా జరిగింది కాదని, దాని వెనుక నేపథ్యం ఉంది కాబట్టే.. ఆ దాడి చేయించింది టీడీపీనే అంటూ తాము ఆరోపించామన్నారు. ఈ వ్యవహారంలో సంబంధం లేదని టీడీపీ వివరణ ఇచ్చుకోవచ్చు లేదంటే సీబీఐ దర్యాప్తు కోరవచ్చని, విచారణ వేగంగా చేయాలని డిమాండ్ చేయవచ్చని, అలాకాకుండా ఇది డ్రామా అనటం సరికాదని చెప్పారు.
దాడి నింద తమపై పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం జగన్‌పై దాడి విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మతి లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
విజయవాడలో సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్‌లో ఈనెల 13న రోడ్ షో నిర్వహిస్తున్న సీఎం జగన్‌పై 8.15 గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రక్తం ధారగా కారుతున్నా ఓర్చుకుని, ప్రాథమిక చికిత్స చేయించుకుని ఆ తర్వాత రెండు గంటల పాటు బస్సుయాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఎక్కడా గాయం చూపుతూ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేయలేదని చెప్పారు. వైద్యుల సూచనపై ఆ తర్వాతి రోజు విశ్రాంతి తీసుకున్నారని వివరించారు. అదే దాడి చంద్రబాబుపై జరిగి ఉంటే దాన్ని తన ప్రచారానికి వాడుకునేవారని చెప్పారు.
డ్రామాలాడే నైజం చంద్రబాబుదేనన్నారు. గతంలో అలిపిరి ఘటన జరిగినప్పుడు చంద్రబాబు చేతికి కట్టువేసుకుని సానుభూతి పొందేందుకు ఆర్నెల్లు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. 2019లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌ను కత్తితో పొడిచినప్పుడు కూడా షర్ట్ రక్తంతో తడిసిపోయిందని, దాన్ని మార్చుకుని ఫ్లైట్ ఎక్కి హైద్రాబాద్‌కు చేరుకుని, చికిత్స తీసుకున్నారేగానీ ఎక్కడా ఆయనకు తగిలిన గాయం గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. డ్రామా ఆడాల్సిన అవసరం సీఎం జగన్‌కు ఏమాత్రం లేదని చెప్పారు. గతంలోకంటే మిన్నగా ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఆదరణ తగ్గిపోయిందని, ఎక్కడికి వెళ్లినా దడి కట్టుకుని సమావేశాలు పెట్టుకుంటున్నారని దెప్పిపొడిచారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతున్న శ్రీ మహారుద్ర సహిత రాజ శ్యామల సహస్ర చండీ యాగ మహోత్సవంలో సోమవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగన్ రెండోసారి అధికారం చేపట్టాలన్న ప్రజల ఆకాంక్ష దేవుడి కటాక్షంతో నెరవేరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment