
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు అడగకుండానే రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో 30 నెలలపాటు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. దాదాపు రూ.17,918 కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిందన్నారు. గురువారం గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఆర్ అనేది వడ్డీ లేని రుణం అని.. దాన్ని సర్దుబాటు చేయకతప్పదన్నారు.
అసలు ఐఆర్ ఇవ్వకుండా డీఏ ఇచ్చి పీఆర్సీ ప్రకటించి ఉంటే సర్దుబాటు సమస్య ఉండేది కాదని చెప్పారు. పరిస్థితులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఐఆర్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వాలు భయపడతాయన్నారు. తెలంగాణ మాదిరి తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేవని తెలిపారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్ వంటి దాదాపు పది అంశాలను కలిపి చూసినప్పుడే వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. కోవిడ్‌తో రాష్ట్ర ఆదాయం గత మూడేళ్లలో 15 శాతం కూడా పెరగలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉద్యోగులకు చేయగలిగినంత చేసిందన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చించాల్సిన పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
సమ్మె వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు..
ఉద్యోగులు సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎస్ కోరారు. కొత్త పీఆర్సీ అమలు అంశంలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెలు, నిరసనలు, ఆందోళనలతో ఎవరికీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని కోరారు. పీఆర్సీకి సంబంధించి ఉద్యోగుల సందేహాలను తీర్చేందుకే ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. పీఆర్సీ ఆలస్యమవుతుంటే ముందస్తు సర్దుబాటుగా ఐఆర్ ఇస్తారన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్గలేదని తేల్చిచెప్పారు. ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చిచూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలని సూచించారు.
ఎవరికీ జీతం తగ్గలేదు
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్) శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ పత్రికలో ఉద్యోగుల జీతం తగ్గుతుందంటూ కథనం వచ్చిందని.. అందులో బేసిక్ వేతనాన్ని తక్కువవేయడంతో తగ్గుదల కనిపించిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. ‘ప్రతి ఉద్యోగికి ఏటా ఇంక్రిమెంట్‌తో 3 శాతం పెరుగుదల ఉంటుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయినా జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం’ అని వివరించారు. ఐఆర్ ప్రకటించేటప్పుడే పీఆర్సీ ఫిట్‌మెంట్‌లో హెచ్చుతగ్గులు ఉంటే ఆ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తామని సంబంధిత జీవోలో స్పష్టంగా పేర్కొన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment