ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు విచ్చేస్తున్న ప్రజలు.. ధాన్య లక్ష్మి కరుణించడంతో ఆనందంలో అన్నదాతలు.. క్రయవిక్రయాలతో జోష్ నింపుకున్న వ్యాపారులు.. కొత్త దుస్తుల కొనుగోళ్లలో అక్కచెల్లెమ్మలు తలమునకలు.. కేరింతలు కొట్టేందుకు పందేల ఏర్పాట్లలో అన్నదమ్ములు.. రంగ వల్లులు, భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు.. గాలి పటాల సందళ్లు, బల ప్రదర్శనలు.. ఈ సన్నివేశాలను ఆనందంగా వీక్షించాలని పరితపిస్తున్న అవ్వాతాతలు.. వెరసి మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి సందడి ఊరూరా కనిపిస్తోంది. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు, కొత్త బైక్‌లు, కొత్త కార్లు.. ఇలా కనీసం ఏదో ఒక్క దాంతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. సంక్రాంతి లక్ష్మికి సంబరాలతో స్వాగతం పలికేందుకు తెలుగు లోగిళ్లు సిద్ధమయ్యాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి కళ ఉట్టి పడుతోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండటంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వివిధ రాష్ట్రాలు, పట్టణాల నుంచి సొంతూళ్ల బాట పట్టే వారితో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులతో టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలుదారులతో అన్ని షాపులు కళకళలాడుతున్నాయి.
నూతన వస్త్రాల దగ్గర నుంచి కార్లు, బంగారం వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుగోళ్లు చేస్తుండటంతో రెండేళ్ల తర్వాత మళ్లీ సంతోషకర వాతావరణం కనిపిస్తోందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కోవిడ్ వల్ల పండుగ వ్యాపారాలు అనుకున్నంతగా సాగలేదని, ఈ ఏడాది మంచి వాతావరణం ఉండటంతో వ్యాపారం పెంచుకోవడానికి వ్యాపార సంస్థలు పలు ఆఫర్లు, ప్రకటనలతో ఆకర్షిస్తున్నాయి. ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు, బొమ్మల కొలువులతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థాలు, సంప్రదాయ కోడి పందాలను చూడటానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు.
హోమ్ థియేటర్స్‌కు మంచి డిమాండ్
ఈ సారి సంక్రాంతి అమ్మకాల్లో ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలదే అగ్రస్థానంగా ఉంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయిని అధిగమించాయని, గతేడాదితో పోలిస్తే సంక్రాంతి అమ్మకాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది అమ్ముడవుతున్న వాటిలో అత్యధికంగా మొబైల్ ఫోన్లు, ఓఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది హోమ్ థియేటర్స్‌కు డిమాండ్ అధికంగా ఉందని సోనోవిజన్ మేనేజింగ్ పార్ట్‌నర్ పొట్లూరి భాస్కర మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. హోమ్ థియేటర్స్ ధరలు రూ.80,000 నుంచి రూ.8 లక్షల వరకు ఉన్నా, అత్యధికంగా హైఎండ్ స్థాయి వాటికే డిమాండ్ ఉందని తెలిపారు.
రెండు నెలల నుంచి వృద్ధి
గత రెండు నెలల నుంచి రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్న విషయాన్ని జీఎస్టీ వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. 2021 డిసెంబర్ నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.1,732 కోట్లు ఉండగా, అది 2022 డిసెంబర్ నాటికి రూ.2,400 కోట్లకు చేరింది. గతేడాది సంక్రాతి నెల అయిన జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.2,000 కోట్లుగా నమోదయ్యాయని, ఈ ఏడాది ఈ సంఖ్య రూ.2,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్పారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతంకుపైగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
కొత్త అల్లుళ్లపై ఆశలు
రాష్ట్రంలో ద్విచక్ర వాహన అమ్మకందారులు ఈ సారి కొత్త అల్లుళ్లపై భారీ గానే ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ద్విచక్ర వాహన అమ్మకాల్లో పురోగతి నమోదవుతుందన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పెళ్లిళ్లు జరగడంతో వాహన విక్రయాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహన అమ్మకాలపై కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా సగటున 18 లక్షల వాహనాలు అమ్ముడవుతుంటే కోవిడ్ సమయంలో అది 9 లక్షలకు పడిపోయిందని, ఇప్పుడు కొద్దిగా కోలుకుని 12 లక్షల స్థాయికి చేరుకుందని కుశలవ డైరెక్టర్ బి.వెంకట రెడ్డి పేర్కొన్నారు.
కానీ దీనికి భిన్నంగా కార్ల అమ్మకాలు కోవిడ్ ముందు కంటే పెరిగాయన్నారు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా 2.7 లక్షల కార్లు విక్రయం అవుతుంటే అది ఇప్పుడు 3.4 లక్షలకు చేరినట్లు తెలిపారు. గతేడాది సంక్రాంతి సీజన్‌లో 4 జిల్లాలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి 250 వరకు వాహనాలను విక్రయించామని, ఈ ఏడాది ఈ సంఖ్య 300 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కానీ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం ఈ స్థాయి వృద్ధి రేటు కనిపించడం లేదన్నారు. గతేడాది సంక్రాంతి మూడు రోజుల్లో కృష్ణా జిల్లాలో 500 ద్విచక్ర వాహనాలను విక్రయించామని, ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు వరుణ్ బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment