వధూవరులుగా గొర్రె, పొట్టేలును సిద్ధం చేస్తున్న గ్రామస్తులు
‘కల్యాణం చూతము రారండి.. మా ఊళ్లో గొర్రె, పొట్టేలు కల్యాణం చూతము రారండి’ అంటూ అంగరంగ వైభవంగా జీవాలకు పెళ్లి బాజాలు మోగించారు. సంప్రదాయం ఉట్టిపడేలా వధూవరులుగా గొర్రె, పొట్టేలును సుందరంగా అలంకరించారు. తొలుత దొడ్డి గంగమ్మకు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక ప్రమిదలను వెలిగించి గౌరమ్మను ఆరాధించారు. అనంతరం గ్రామ హితం కోరుతూ శాస్త్రోక్తంగా జీవాలకు వివాహం జరిపించారు.
సాక్షి, కేవీపల్లె(చిత్తూరు): మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో ఆదివారం రాత్రి గొర్రె, పొట్టేలు కల్యాణం నిర్వహించారు. ఏటా సంక్రాంతి అనంతరం రెండు రోజులకు జీవాలకు వివాహం జరిపించడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా పంట పొలాలను చీడపీడల నుంచి, గొర్రెలను అంటు వ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్తుల విశ్వాసం. వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు వైపు దామోదర్ కుటుంబసభ్యులు నిలిచి పెళ్లి తంతును వైభవంగా జరిపించాయి. పెద్దసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
పురాతన ఆచారం
తాతల కాలం నుంచి గొర్రె, పొట్టేలుకు పెళ్లి చేయడం ఆచారంగా వస్తోంది. గ్రామానికి మంచి జరగాలని, మూగ జీవాలను కాపాడాలని గౌరమ్మ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ ఆచారంతో అంతా మంచే జరుగుతోంది.
– కంబళ్ల రెడ్డెప్ప, గౌడు, కురవపల్లె
పుణ్యకార్యంగా భావిస్తున్నాం
పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మేము కొనసాగించడం పుణ్యకార్యంగా భావిస్తున్నాం. గొర్రె, పొట్టేలుకు వివాహం చేయడం మా గ్రామంలో పెద్ద పండుగ. గౌరమ్మ అనుగ్రహంతో ఈ ఆచారాన్ని ఏటా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నాం.
– చామంచుల శ్రీరాములు, పినపెద్ద, కురవపల్లె
Comments
Please login to add a commentAdd a comment