
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురైంది. అనంతపురం జిల్లా పుట్టులు మండలం యెల్లుట్ల గ్రామ పరిధిలో బైరైటీస్ లీజు దరఖాస్తును తిరస్కరిస్తూ గనుల శాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ జేసీ విజయ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మైనింగ్ కార్యకలాపాల నిమిత్తం అటవీ భూమిని విస్తృతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టేజ్ 1, 2 పర్మిట్లు జారీ చేసిన తరువాత అటవీ భూముల పరిరక్షణ పేరుతో అనుమతుల రద్దుకు వీల్లేదన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టేజ్ 1, 2 పర్మిట్ల జారీకి అనుమతులిచ్చినా మైనింగ్ లీజు అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. అటవీయేతర ప్రాంతంలో బైరైటీస్ లభ్యత ఉంది కాబట్టి గనుల శాఖ డైరెక్టర్ ఈ అనుమతులు రద్దు చేశారని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్ మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ప్రకృతి సంపదను పొదుపుగా వినియోగించుకోవాలని, సహజ సంపదను భావి తరాలకు అందచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అటవీ భూమిలో బైరైటీస్ తవ్వకాల నిమిత్తం జేసీ విజయ 2017లో దరఖాస్తు చేసుకోగా తిరస్కరిస్తూ 2019 డిసెంబర్ 3న గనుల శాఖ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
నష్టం వాటిల్లిందని లీజు కోరలేరు..
మైనింగ్ లీజుల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందుతున్నాయని, వీటిని అనుమతించడం వల్ల అటవీ ప్రాంతం తరిగిపోయి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఒక ఖనిజం లభ్యత రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు, ఉన్న ఖనిజం లభ్యత అయిపోయినప్పుడు మాత్రమే అటవీ ప్రాంతంలో మైనింగ్ దరఖాస్తును అనుమతించాలని అటవీ సంరక్షణ చట్ట నిబంధనలు చెబుతున్నాయని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కడప, మార్కాపురం ప్రాంతాల్లో నాలుగు లక్షల టన్నుల బైరైటీస్ నిల్వలు ఉన్నాయన్న ఏజీ వాదనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. అటవీకరణ నిమిత్తం తాను రూ.50 లక్షలు ఖర్చు చేశానని, అనుమతులు రద్దు చేయడం వల్ల తనకు నష్టం కలిగిందని జేసీ విజయ నివేదించడంతో చట్టపరమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు. నష్టం కలిగిందన్న కారణంతో మైనింగ్ లీజు కోరజాలరని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment