
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంత మంది శిశువులు పుడుతున్నారు.. వారి వివరాలు ఏమిటి.. వారి ఆరోగ్యం ఎలా ఉంది.. తదితర వివరాల నమోదు ప్రక్రియ ఇప్పుడు పరుగులు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్సీహెచ్ (రీ ప్రాడక్టివ్ చైల్డ్ హెల్త్) పోర్టల్‌లో చిన్నారుల నమోదులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. జనాభా గణన నుంచి, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల వరకూ ఈ పోర్టల్‌లో నమోదయ్యే వివరాలే కీలకంగా ఉన్నాయి. అయినప్పటికీ చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పుట్టే శిశువుల వివరాలను నమోదు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2019కి ముందు ఈ పోర్టల్‌లో 50 శాతానికి మించి నమోదు జరిగేది కాదు. ఇప్పుడు 2020–21లో 90 శాతం నమోదు అవుతున్నట్టు ఆరోగ్య శాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96.78 శాతం నమోదైనట్టు తేలింది. మొత్తంగా గత 11 మాసాల్లో 6.98 లక్షల మంది చిన్నారుల వివరాలు నమోదయ్యాయి.
పోర్టల్‌లో నమోదు వల్ల ఎన్నో ఉపయోగాలు
► ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు వల్ల జనగణన పక్కాగా ఉంటుంది.
► చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, ఇతర వైద్య సదుపాయాలు కల్పించడం సులువవుతుంది.
► జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు పంపిణీ చేస్తుంది.
► చిన్నారులతో పాటు తల్లుల వివరాలూ ఆటోమేటిగ్గా పోర్టల్‌లో నమోదవుతాయి.
► వివరాలు అందుబాటులో ఉండటం వల్ల మెడికల్ రికార్డు పక్కాగా అమలు చేయొచ్చు.
► శిశువుల్లో వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం.
► పోర్టల్‌లో నమోదు అయిన చిన్నారుల ఆరోగ్య సమస్యలపై స్పెషల్ ట్రాకింగ్ ఉంటుంది.
2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 2 వరకు పోర్టల్‌లో నమోదు అయిన శిశువుల వివరాలు
Comments
Please login to add a commentAdd a comment