హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్‌ను సత్కరిస్తున్న కౌన్సిల్ ప్రతినిధులు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్
విశాఖలో ఘనంగా కౌన్సిల్ రజతోత్సవం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సమాజాభివృద్ధిలో మానవ హక్కుల కౌన్సిల్ సేవలు ప్రశంసనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వ్యభిచార రొంపిలోకి వెళ్లకుండా.. వారి హక్కులు కాపాడేలా మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, జిల్లా లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ప్రజలు, మహిళలు, విద్యార్థులకు భరోసానిచ్చేలా ఈ కార్యక్రమాలుండాలని, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ మానవ హక్కుల కౌన్సిల్‌ను స్థాపించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో వలంటీర్లను తయారుచేసి, వారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్లుగా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమారు 6 వేల ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తిని కౌన్సిల్ ప్రతినిధులు సత్కరించారు. కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మి, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవరా సత్యనారాయణ, వివిధ జిల్లాల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment