మరింత కఠిన ఆంక్షలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.. | Single Use Plastic Ban: Central Govt Stringent Restrictions On Plastic | Sakshi
Sakshi News home page

Single Use Plastic Ban: ప్లాస్టిక్‌పై పోరు మరింత తీవ్రం

Published Sun, Jun 19 2022 11:02 AM | Last Updated on Sun, Jun 19 2022 3:54 PM

Single Use Plastic Ban: Central Govt Stringent Restrictions On Plastic - Sakshi

సాక్షి, అమరావతి: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ కవర్ల తయారీ, అమ్మకం, వినియోగంపై కేంద్రం మరింత కఠిన ఆంక్షలు విధిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో 50 మైక్రాన్ల మందం గల కవర్లను బ్యాన్‌ చేసినప్పటికీ మార్కెట్‌లో వినియోగం తగ్గలేదు. 75 మైక్రాన్ల మందం గల కవర్ల వినియోగానికి అనుమతినిచ్చారు. తక్కువ మందం గల కవర్లు పునర్‌ వినియోగానికి ఉపయోగపడకపోగా, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని భావించిన కేంద్రం వాటి స్థానంలో ఈ ఏడాది డిసెంబర్‌ 31 నుంచి 120 మైక్రాన్లు, అంతకంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లను మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలకు జారీ చేసింది.
చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?

మన రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ కవర్లు తయారు చేస్తున్న, అమ్ముతున్న కేంద్రాలపై మున్సిపల్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సరుకును సీజ్‌ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరికి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను బ్యాన్‌ చేస్తున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమల యజమానులు, హోల్‌సేల్‌ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన కార్యక్రమాలు..
ఒక్కసారి వినియోగించి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌.. ముఖ్యంగా హోటళ్లు, శుభకార్యాల్లో వినియోగించే ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, టేబుల్‌పై పరిచే షీట్లు వంటి వాటి వినియోగాన్ని జూలై 1 నుంచి పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులతో పాటు, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి వద్ద నమోదు చేసుకున్న 139 ప్లాస్టిక్‌ పరిశ్రమలు తక్కువ మందంగల  క్యారీబ్యాగులను తయారు చేస్తుండటంతో వాటి లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. జూలై 1 నాటికి తమ వద్దనున్న సరుకును రీసైక్లింగ్‌కు పంపించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ తయారు చేస్తున్నవారిపైనా, స్టాకిస్టులపైన, ప్లాస్టిక్‌ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నవారిపైనా దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీఎత్తున ప్లాస్టిక్‌ కవర్లు, వినియోగ సరుకును సీజ్‌ చేయడమే కాకుండా రూ.1.54 కోట్ల పెనాల్టీ సైతం విధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement