సాక్షి, అమరావతి: ఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. తన ఆస్తులను మరింత సమర్థంగా సద్వినియోగం చేసుకునే వ్యూహంలో భాగంగా బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతోంది. రెస్కో విధానంలో రాష్ట్రంలో 838 సోలార్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది.
నాలుగు ప్లాంట్లు రెడీ
పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లను ఆర్టీసీ నెలకొల్పింది. మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, కాకినాడలలో ఒక్కొక్కటి 100 కిలోవాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.37 లక్షల వరకు వెచ్చించింది. ప్రతి ప్లాంట్ ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఏడాదికి రూ.14 లక్షల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఓపెక్స్, ఇన్సిడెంటల్ చార్జీలు కలుపుకుని ఆ సోలార్ ప్లాంట్ల స్థాపన వ్యయం నాలుగేళ్లలో వెనక్కి వస్తుంది. ఐదో ఏడాది నుంచి ఏడాదికి రూ.12 లక్షల చొప్పున లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు.
రెస్కో విధానంలో 838 ప్లాంట్లు
ఇకపై రెస్కో విధానంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదట దశలో ఈ ఆర్థిక సంవత్సరంలో 400 ప్లాంట్లు నెలకొల్పేలా కార్యాచరణ సిద్ధం చేసింది. మిగిలిన 438 ప్లాంట్లను రాబోయే రెండేళ్లలో నెలకొల్పుతుంది. ఇందు కోసం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రెస్కో విధానంలో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై మొత్తం 838 రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తుంది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించి కంపెనీని ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ ఆర్టీసీ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను నెలకొల్పి 25 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది.
ఆదా ఇలా..
► ప్రస్తుతం బస్‌స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్‌కు రూ.10.15 చొప్పున, పారిశ్రామిక అవసరాల కిందకు వచ్చే గ్యారేజీలు, వర్క్ షాపులకు యూనిట్‌కు రూ.6.76 చొప్పున విద్యుత్ చార్జీలను ఆర్టీసీ చెల్లిస్తోంది.
► టెండర్ దక్కించుకున్న సంస్థ ఆర్టీసీకి 25 ఏళ్ల పాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం వెయ్యి కిలోవాట్ల ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను యూనిట్‌కు గరిష్టంగా రూ.5గా సూత్రప్రాయంగా నిర్ణయించారు. భవిష్యత్‌లో ఆ రేట్లు ఇంకా
తగ్గుతాయి.
► సోలార్ విద్యుత్ వల్ల బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్‌పై రూ.5 చొప్పున, గ్యారేజీలు, వర్క్‌షాపులకు యూనిట్‌కు రూ.3 వరకు ఆర్టీసీకి ఆదా అవుతుంది.
సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం
సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికలో భాగంగానే బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాం. ఆర్టీసీపై వ్యవస్థీకృత భారం పడకుండా ఉండేందుకు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ భాగస్వామ్యంతో రెస్కో విధానంలో ఈ ప్లాంట్లను నెలకొల్పుతాం. దీనివల్ల ఆర్టీసీ ఆస్తులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు విద్యుత్ చార్జీల భారం 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
– ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment