
సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దులో అడ్డుకోవడంపై బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అంశాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌పై ఇప్పటికీ సంపూర్ణ హక్కులున్నట్టు చెప్పారు. అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో రెండు నిండు ప్రాణాలు పోయాయని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని సోము వీర్రాజు చెప్పారు.