సాక్షి, చిత్తూరు: కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నటుడు సోనూ సూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ రైతు కుటుంబానికి ఇచ్చిన మాటను గంటల వ్యవధిలోనే నిజం చేశారు. చిత్తూరు జిల్లా కేవిపల్లి మండలం మహల్‌కు చెందిన ఓ రైతు పేదరికంలో మగ్గిపోతున్నాడు. కుటుంబ పోషణకు వ్యవసాయమే ఆధారం కాగా, నేల సాగు చేసేందుకు అతని వద్ద ఎద్దులు కూడా లేవు. దాంతో అతని ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా మారి తండ్రికి వ్యవసాయంలో దన్నుగా నిలిచారు. ఆ అమ్మాయిలిద్దరూ కాడి లాగడంతో వెనుకనుంచి తల్లిదండ్రులిద్దరూ విత్తనాలు వేశారు. వారి దీన స్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్ వెంటనే స్పందించారు.
(చదవండి: ‘సాఫ్ట్‌వేర్ శారద’ కథనంపై స్పందించిన సోనూసూద్)
ఈరోజు సాయంత్రానికల్లా రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. అన్నమాట ప్రకారమే ఆదివారం సాయంత్రానికి సదరు రైతు ఇంటి ముందు ట్రాక్టర్ ప్రత్యక్షమైంది. సాయం చేస్తానని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ట్రాక్టర్ ఇవ్వడంతో సోనూపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనూ రియల్ హీరో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నటుడి తక్షణ సాయంపై రైతు కుటుంబం సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయింది. ఆయన దయార్థ్ర హృదయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
(వారికి కావాల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్టర్)
Comments
Please login to add a commentAdd a comment