
ఒంగోలు మెట్రో/కందుకూరు రూరల్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన పూర్వీకులు ఇక్కడి కందుకూరు సమీపంలోని మాచవరం గ్రామానికి చెందినవారు. బాలు తండ్రి సాంబమూర్తి మాచవరం శివాలయంలో అర్చకత్వం చేస్తూ స్కందపురి మాధవ విలాస సభ సంస్థ ద్వారా హరికథలు చెబుతూ జీవనం సాగించినట్టు అక్కడి వారు పేర్కొంటున్నారు.
బాల సుబ్రహ్మణ్యం పుట్టిన తర్వాత ఆ కుటుంబం నెల్లూరు జిల్లాకు వలస వెళ్లారని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. కాగా బాలు మేనత్త జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఉండేవారు. ఈ క్రమంలో బాలు అనేకసార్లు ఈతముక్కల, కొత్తపట్నం గ్రామాలకు వచ్చేవారు. సాంబమూర్తి కుటుంబం మాచవరంలో ఇల్లు అమ్మి వలస వెళ్లిన తర్వాత అప్పుడప్పుడు ఊరు వస్తూ ఉండేవారు. 25వ ఏట బాలసుబ్రహ్మణ్యం ఈ గ్రామానికి వచ్చి శివాలయం ఉత్సవాల్లో పాటలు పాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన అనేక సాంస్కృతిక, కళాసంస్థలు పలుమార్లు బాలును సత్కరించాయి.