
సాక్షి, అమరావతి: శ్రీశైలంలోని వ్యాపారులకు లలితాంబిక వ్యాపార సముదాయంలో షాపులు కేటాయించే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ దశలోనూ ఉల్లంఘించలేదని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న మంగళవారం హైకోర్టుకు నివేదించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు ఎనలేని గౌరవం అని లవన్న తరఫు న్యాయవాది అశోక్ రామ్ కోర్టుకు విన్నవించారు.
షాపుల కేటాయింపుపై రాద్ధాంతం చేస్తున్న పిటిషనర్లు, అసలు షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనలేదని, అందువల్ల వారు షాపులు పొందలేకపోయారని తెలిపారు. షాపుల కేటాయింపు కోసం వారు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిగణనలోకి తీసుకుని మరోచోట షాపులు కేటాయిస్తామన్నారు. 8 నెలల కాలంలో 24 పిటిషన్లు దాఖలు చేసి, షాపుల కేటాయింపు విషయంలో ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
షాపుల కేటాయింపు కోసం నిర్వహించిన వేలంలో గరిష్ట ధర రూ.24 లక్షలకు చేరిందని తెలిపారు. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించే నాటికే షాపుల కూల్చివేత పూర్తయిందన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా ఈవో ఆదేశాల మేరకు పిటిషనర్ల షాపులను అధికారులు కూల్చేశారన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్.. షాపుల కేటాయింపు కోసం ఈవోకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ వినతి ఆధారంగా షాపుల కేటాయింపులో నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని ఈవోకు స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment