దుకాణాల్లో వరుస చోరీలు
- ఉలిక్కిపడ్డ కలిదిండి
- రూ.48 వేల నగదు అపహరణ
- ఆందోళనలో వ్యాపారులు
కలిదిండి, న్యూస్‌లైన్ : దొంగల బీభత్సంతో ఒక్కసారిగా కలిదిండి ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఒకేసారి దొంగలు షాపులపై పడి నగదు దోచుకున్నారు. దీంతో వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. కలిదిండి సెంటరులోని ఆరు షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.48 వేల నగదును దొంగలు దోచుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజూమాదిరిగానే గురువారం రాత్రి 10 గంటలకు వ్యాపారులు తమ దుకాణాలు మూసి ఇళ్లకు వెళ్లిపోయారు.
తిరిగి శుక్రవారం ఉదయాన్నే షాపులు తెరిచేందుకు రాగా షట్టర్ల తాళాలు పగలగొట్టి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన వాటిలో సబిశెట్టి ధనవీరవెంకట వరప్రసాద్‌కు పురుగు మందుల షాపు, సత్యపాండురంగ గుప్తకు చెందిన రొయ్యలమేత షాపు, సోము భూషణానికి చెందిన కిరాణా షాపు, చాదళ్ల కృష్ణమూర్తికి చెందిన రొయ్యల మేత దుకాణం, నీలి దుర్గా వెంకట సత్యనారాయణకు చెందిన మందుల షాపు, హిమాలయ బ్రాందీ షాపు ఉన్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చోరీలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ డి.నాగన్న, కైకలూరు సీఐ వెంకటేశ్వరరావు, కలిదిండి ఎస్సై యేసేబు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశామని డీఎస్పీ డి.నాగన్న తెలిపారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసు గస్తీ పెంచుతామన్నారు. మచిలీపట్నం నుంచి క్లూస్ టీం వచ్చి వేలుముద్రలను సేకరించింది.