State Election Commission Appeals Against AP MPTC, ZPTC Election - Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్‌

Published Sat, Jun 19 2021 4:37 AM | Last Updated on Sat, Jun 19 2021 10:39 AM

State Election Commission Appeals Against Mptc Zptc Election - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్‌ దాఖలు ప్రక్రియ పూర్తైందని, పిటిషన్‌కు నెంబరు కేటాయింపు లాంటి అంశాలు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్‌ ప్రక్రియ కూడా ముగిసిన నేపధ్యంలో కౌంటింగ్‌కు అనుమతించాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. 

ఏడాదికిపైగా ఎన్నికల ప్రక్రియ..
వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసి తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కరోనా పేరుతో ఆ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రామ  పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించిన సమయంలోనే పరిషత్‌ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నా నిమ్మగడ్డ కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారన్న ఆరోపణలున్నాయి. నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 8వతేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్‌ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్‌ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు వెలువరించింది.


గెలిచినా ఏడాదిగా నిరీక్షణ..
2020 మార్చిలో పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. హైకోర్టు తాజా తీర్పు తర్వాత కూడా ఆ ఏకగ్రీవాలన్నీ యధాతథంగానే కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గతంలోనే స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు ఏడాదికిపైగా వారంతా పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. 


11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పరిషత్‌ ఫలితాలతో లింక్‌
శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 11 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి కావాలని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన వారు జిల్లాలవారీగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్‌సీపీ ఖాయంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మండలిలో అధికార వైఎస్సార్‌సీపీ బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ పరిషత్‌ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement