బలపడిన అల్పపీడనం | Strengthened Low pressure, Transforms into Yass cyclone tomorrow | Sakshi
Sakshi News home page

బలపడిన అల్పపీడనం

Published Sun, May 23 2021 3:33 AM | Last Updated on Sun, May 23 2021 1:40 PM

Strengthened Low pressure, Transforms into Yass cyclone tomorrow - Sakshi

సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం సాయంత్రానికి మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా.. 24వ తేదీన యాస్‌ తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌ తీర ప్రాంతాలకు ఈ నెల 26న చేరే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం ఒడిశా, బంగ్లాదేశ్‌ మధ్య తీరాన్ని తాకే వీలుందన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి ఆదివారం గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతోనూ, 24న 50 నుంచి 60 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ., గరిష్టంగా 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తామని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. 5 రోజులపాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు.  
తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం 

అప్రమత్తమైన నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌ 
తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం, తీరగస్తీ దళం(కోస్ట్‌గార్డ్‌) సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 8 ఫ్లడ్‌ రిలీఫ్‌ బృందాలతోపాటు నాలుగు డైవింగ్‌ బృందాలను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు తూర్పు నౌకాదళం పంపించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 4 నేవీ షిప్‌లు విశాఖ నుంచి బయలుదేరాయి. విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా, చెన్నైలోని ఐఎన్‌ఎస్‌ రజాలి నేవల్‌ ఎయిర్‌ స్టేషన్లలో నేవల్‌ హెలికాప్టర్లు, మెడికల్‌ టీమ్‌లు బయలుదేరాయి. ఇండియన్‌ కోస్ట్‌ గార్డు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. తమిళనాడు, ఒడిశా, ఏపీ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోస్ట్‌ గార్డ్‌íÙప్స్, సేఫ్టీ బోట్స్‌ను పంపించేందుకు సిద్ధంగా ఉంచినట్టు విశాఖ కోస్ట్‌గార్డ్‌ ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. నలుగుర్ని బలిగొన్న పిడుగులు 
సాక్షి నెట్‌వర్క్‌: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సగటున 22.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. జిల్లాలోని చేబ్రోలులో అత్యధికంగా 81.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కంభం చెరువుకు వరద నీరు వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ, లోతువాగు, జంపలేరు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కర్నూలు జిల్లా వెలుగోడులో 60.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లా అంతటా సగటున 14.2 మిలీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం వెలిగండ్ల, విజయవాడలో 9 సెం.మీ.,గజపతినగరం, ప్రొద్దుటూరు, ముద్దనూరు, దువ్వూరులో 7, వల్లూరు, రాయదుర్గం, కమలాపురం, కంబదూరులో 6 సెం.మీ., పోలవరం, చింతలపూడి, భీమవరం, బద్వేల్, హిందూపురం, పెనుకొండ, ఆత్మకూరు, చిత్తూరు, కడప, బ్రహ్మసముద్రంలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, విజయనగరం జిల్లాలో శనివారం వేర్వేరుచోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడ్డారు. బొబ్బిలి మండలం చింతాడలో సంకిలి తౌడు(45), గుంట చిన్నారావు (35), ఆజారి చిన్నారావు(35) పిడుగుపడి మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. నెల్లిమర్ల మండలం సతివాడలో గొర్రెల కాపరి గొంప సూరిబాబు(28) మృతిచెందాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement