సాక్షి, అమరావతి: ఒక దాని వెంట మరొక పరీక్షతో ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమాయత్తానికి తగిన సమయం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇంటర్, సీబీఎస్‌ఈ పబ్లిక్ పరీక్షలు, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్షలు, ప్రైవేటు వర్సిటీల పరీక్షలు వరుసగా విద్యార్థులపై వచ్చి పడుతున్నాయి. మార్చి నుంచి ఆగస్టు వరకు వరుసగా వరుస పరీక్షలకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11న ప్రారంభించి మార్చి 31తో ముగించాలనుకున్నారు.
కానీ కోర్టు తీర్పు కారణంగా ఇవి వాయిదా పడ్డాయి. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు జరగాలి. ఐతే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు జరగనుండడంతో వీటిని వాయిదా వేశారు. జేఈఈ పరీక్షల అనంతరం ఒక్క రోజు కూడా వ్యవధి లేకుండా ఏప్రిల్ 22వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు మొదలవుతాయి. సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి.
జేఈఈ రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరుగుతాయి. ఇవి ముగిసిన వెంటనే జూన్‌లో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్ జరుగుతుంది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి కీలకమైన నేషనల్ ఎలిజిబులిటీ టెస్టు (నీట్) షెడ్యూల్ ఇంకా వెలువడకున్నా జులై ఆఖరున, లేదా ఆగస్టులో జరుగుతుందని అంచనా. మరోవైపు సెంట్రల్ వర్సిటీలు, బిట్స్ పిలానీ, అమృత వర్సిటీ, వీఐటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రైవేటు వర్సిటీల ప్రవేశ పరీక్షలు కూడా ఈ సమయంలోనే జరుగుతున్నాయి. ఇలా మార్చి మొదలుకొని ఆగస్టు ఆఖరు వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్షలు రాయాలి.
జేఈఈ సిలబస్ య«థాతథం
కోవిడ్ కారణంగా 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో సీబీఎస్‌ఈతోపాటు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు కూడా సిలబస్‌ను కుదించాయి. ఆమేరకు విద్యార్థులు పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్‌ను మాత్రం ఎన్టీఏ తగ్గించలేదు. పూర్తి సిలబస్‌తోనే పరీక్షలుంటాయని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఇప్పుడు పూర్తి సిలబస్‌తో జేఈఈ కోసం ప్రత్యేక కోచింగ్‌లతో నానా అవస్థలూ పడుతున్నారు. జేఈఈ రెండు విడతల పరీక్షల మధ్య ఒక్క నెల కూడా వ్యవధి లేకపోవడం మరీ ఇబ్బందికరంగా మారింది. ఈసారి జేఈఈ మెయిన్ ఆన్‌లైన్‌లో జరగడం మరో పెద్ద సమస్యగా మారింది. కాలేజీల్లో, కోచింగ్ సెంటర్లలో ఆన్‌లైన్ విధానంలో తర్ఫీదు ఇచ్చేందుకు తగినన్ని కంప్యూటర్లు, ఇతర సదుపాయాలు లేవని, దీంతో సరిగా ప్రిపేరవలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో ఎ, బి సెక్షన్ల కింద బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. బి సెక్షన్‌లోని న్యూమరికల్ టైప్ ప్రశ్నలకు సరైన సమాధానమిస్తే 4 మార్కులు వస్తాయి. తప్పుడు సమాధానమిస్తే 1 మార్కు కోత పడుతుంది. అసలే ప్రిపరేషన్‌కు సమయం లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఈ నెగెటివ్ మార్కుల విధానంతో మరింత నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. జేఈఈ పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించడమో, లేదా కొంత వ్యవధి ఉండేలా వాయిదా వేయడమో చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్టీఏను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment