సాక్షి, అమరావతి: ఏపీ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటి వరకు 2 బీహెచ్‌కే (రెండు బెడ్ రూములు, కిచెన్)3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల స్థానంలో కొత్తగా అరగది వచ్చి చేరింది. ఇప్పుడు కొత్తగా 2.5 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు కావాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. కోవిడ్ తర్వాత కొనుగోలుదారులు పిల్లల ఆన్‌లైన్ క్లాసులు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్ కావాలని అడుగుతుండటంతో దీనికి అనుగుణంగా బిల్డర్లు ప్రత్యేకంగా ఒక అర గదిని కూడా నిర్మిస్తున్నారు.
బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ స్టడీ రూమ్ కాన్సెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పుడే ప్రవేశించిందని బిల్డర్లు చెబుతున్నారు. స్టడీ రూమ్ కాన్సెప్ట్‌కు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు విశాఖలో పలువురు బిల్డర్లు 2.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు. కోవిడ్ తర్వాత విశాఖ, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో మార్కెట్ ఇంకా పుంజుకోవాల్సి ఉందని తెలిపారు.
నగర శివార్ల వైపు చూపు..
నగరంలో విశాలమైన ఇంటిని తీసుకోవడానికి బడ్జెట్ సరిపోకపోవడంతో కొనుగోలుదారులు దృష్టి నగర శివార్ల వైపు మళ్లుతోంది. దీంతో విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి పట్టణ శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో లభిస్తుండటంతో కొనుగోలుదారులు తక్కువ బడ్జెట్‌లో విశాలమైన ఇంటి కోసం నగర శివార్ల వైపునకు చూస్తున్నారని శ్రీనివాస్ చెప్పారు. విశాఖలో ఒక చదరపు అడుగు అపార్ట్‌మెంట్ ధర రూ.7,000 –10,000 వరకు ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ వంటి చోట్ల రూ.4,000–5,000 వరకు ధర పలుకుతోంది.
అచ్యుతాపురం, పరవాడ, అగనంపూడి, ఆనందపురం, తగరపువలస వంటి శివారు ప్రాంతాలకు వెళితే చదరపు అడుగు రూ.4,000 లోపే దొరుకుతుండటంతో మధ్యతరగతి ప్రజలు ఇక్కడ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు విశాఖ క్రెడాయ్ చైర్మన్ బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలో అయితే పోరంకి, తాడిగడప, గొల్లపూడి, కుంచనపల్లి, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయని బిల్డర్లు పేర్కొంటున్నారు. గృహ రుణాల వడ్డీ రేట్లు కారు చౌకగా ఉండటం కూడా కొనుగోళ్లకు ఊతమిస్తోందని బిల్డర్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment