కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కేదారేశ్వరయ్య గత ఫిబ్రవరిలో గుండెపోటుకు గురవటంతో కుటుంబ సభ్యులు స్థానిక జీజీహెచ్‌లో చేర్చారు. స్టెంట్ వేయడానికి వీలులేని ప్రదేశంలో రక్తనాళాల్లో బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ అవసరమైంది. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చిన్న కోతతో అరుదైన పద్ధతిలో బైపాస్ సర్జరీ చేశారు. ప్రైవేట్‌లో రూ.5 లక్షలు దాకా ఖర్చయ్యే శస్త్ర చికిత్సను జీజీహెచ్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు.
తెనాలి రూరల్ మండలం పెదరావూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థికి గత నెలలో ఫిట్స్ రావడంతో కన్ను తీవ్రంగా వాచింది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొనడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ముక్కులో ఇటమాయిడ్ సైనసైటిస్‌తో ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్థారించిన వైద్యులు ఆర్టిటల్ డికంప్రషన్ ఆపరేషన్ ద్వారా విద్యార్థి కంటి చూపుతో పాటు, ప్రాణాలను కాపాడారు. సుమారు రూ.3 లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారు.
సాక్షి, అమరావతి: అరుదైన శస్త్ర చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బోధనాస్పత్రుల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రోగుల తాకిడికి అనుగుణంగా వనరులు సమకూర్చడంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయి.
ఏడాదిలో 2.22 లక్షల కేసులు
2022–23లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 2,22,147 కేసులకు వైద్య సేవలు అందించారు. ఇందుకు రూ.388.63 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018–19 నుంచి బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులను పరిశీలిస్తే ఇదే అత్యధికం. టీడీపీ హయాంలో కేవలం 90 వేల లోపు కేసులకు మాత్రమే బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందగా ఇప్పుడు ఏకంగా రెండు లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం.
విజయవాడ జీజీహెచ్ టాప్
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవల్లో విజయవాడ జీజీహెచ్ 2022–23లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 27,081 ఆరోగ్యశ్రీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 22,104 కేసులతో కర్నూలు జీజీహెచ్ రెండో స్థానంలో, 21732 కేసులతో విశాఖ కేజీహెచ్ మూడో స్థానంలో ఉన్నాయి.
ప్రత్యేక పర్యవేక్షణ
ఇన్నాళ్లూ ప్రభుత్వాస్పత్రుల్లో వనరులు సరిగా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని మరింత పెంచి ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2019 నుంచి బోధనాస్పత్రుల్లో 1,582 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటు ప్రమోషన్ల రూపంలో కలిపి మొత్తం రెండు వేల వరకూ పోస్టుల భర్తీ చేపట్టింది. గతంతో పోలిస్తే మైనర్, మేజర్ సర్జరీలు, ఇతర చికిత్సలు బోధనాస్పత్రుల్లో గణనీయంగా పెరిగాయి. ఆరోగ్యశ్రీ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచినట్లు డీఎంఈ డాక్టర్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతివారం సమీక్ష చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment