
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను రాష్ట్ర స్థాయి కమిటీ రెండు రోజుల్లో పరిశీలించనుంది. మార్చి 3 వరకు గడువున్నా కూడా.. ఈలోపే ఒకట్రెండు సార్లు సూచనలు, అభ్యంతరాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు బుధవారం సమావేశం కానున్నారు. వచ్చిన సలహాలు, అభ్యంతరాలను తొలుత స్కూృటినీ చేయనున్నారు. ఆ తర్వాత వాటిపై కలెక్టర్లు రాసిన రిమార్కులను పరిశీలిస్తారు. అభ్యంతరాలు, సూచనల్లోని ప్రామాణికత, ఇతర అంశాలను అధ్యయనం చేసి.. చివరిగా వాటిని సీఎస్ నేతృత్వంలోని కమిటీకి సిఫారసు చేయనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు.
అనంతపురం నుంచి అత్యధికంగా..
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,400కు పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. వాటిలో అనంతపురం జిల్లా నుంచే 700 సూచనలు వచ్చాయని సమాచారం. పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ.. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పోస్టుకార్డుల్లో ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా ఈ అభ్యంతరాలు పంపించినట్లు సమాచారం. అనంతపురం తర్వాత నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటిలో సమంజసమైన అభ్యంతరాలు, ప్రామాణికత ఉన్న సూచనలను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment