తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిపోయి.. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
చదవండి: టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా..
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి సిద్దా రాఘవులు, ఎంపీ కోటగిరి శ్రీధర్, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ టీ.ఏ. శరవణ, తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు.
Comments
Please login to add a commentAdd a comment