
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ నెల 15 నుంచి జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే క్రమంలో వారాంతంలో సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులు అధికంగా ఉండే క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం, ఉచిత వసతిగృహాల వద్ద ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
దర్శన ప్రవేశ మార్గాల్లో టీటీడీ విజిలెన్స్‌తో పాటు, పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు సిద్దంగా ఉంచుతామన్నారు. శ్రీవారి పోటులో నిత్యం 3 లక్షల 50 వేల లడ్డూల తయారీచేస్తున్నట్టు తెలిపారు. వారానికి 127 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాగా, అలిపిరి నుంచి మోకాళ్ల మెట్ల వరకు మరో రోడ్డు వేయడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ కంపెనీతో సర్వే చేయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment