బందరు రోడ్డులోని స్వర్ణ హైట్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా అండర్‌గ్రౌండ్‌లో కిచెన్
కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ భవన నిర్మాణ అనుమతులకు నీళ్లోదిలింది. వినియోగదారుల నుంచి భారీ స్థాయిలో హోటల్ బిల్లు వసూలు చేస్తున్న యాజమాన్యం వారి భద్రతను గాలికి వదిలేసింది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు హోటల్‌కి ఉండాల్సిన కనీస అగ్రిప్రమాద నిరోధకాలు కూడా ఏర్పాటు చేయలేదంటే హోటల్ యాజమాన్యానికి ఉన్న నిబద్ధత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
పటమట(విజయవాడ తూర్పు): నగరంలోని హోటళ్లు. భారీ షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఆస్పత్రుల యాజమాన్యాలకు ఆదాయమే తప్ప వినియోగదారుల భద్రత అనేది పట్టదని తాజాగా హోటల్ స్వర్ణప్యాలెస్ ఘటన చెబుతోంది. నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భవన నిర్మాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమలు చేయాల్సిన నిబంధనలు, అనుమతులు ఇవ్వటానికి అవలంబించాల్సిన పరిశీలనలు కేవలం తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. కేవలం రెసిడెన్షియల్ భవనానికి మాత్రమే వీఎంసీ నుంచి అనుమతులు పొందిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ కేటగిరీలో వ్యాపారం నడుపుతోంది. 18 మీటర్ల ఎత్తును ప్రామాణికంగా హోటల్ యాజమాన్యం గత ప్రభుత్వాల సిఫారసుతో అనుమతులు పొంది ఇప్పుడు కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు బలికొంది.
ప్రమాద సమయాల్లో సంరక్షణ ఏదీ..
హోటళ్లు, ఆస్పత్రులు, కాంప్లెక్స్‌లకు రెండు మార్గాలు ఉండాలి. భవనానికి ఒకటి వెళ్లేందుకు.. మరొకటి అత్యవసర సమయంలో బయటకు వచ్చేందుకు. అత్యవసర మార్గలు ఆర్‌సీసీతో లేదా మెటల్‌తో కానీ మెట్లు ఏర్పాటు చేయాలి. కానీ హోటల్ స్వర్ణప్యాలెస్‌కు ఒక ఎంట్రీ మాత్రమే ఉంది. అత్యవసర మార్గం లేకపోవటం మరణాలకు ప్రధాన కారణం.
♦ ఎమర్జెన్సీ లైట్స్ కనీసం నాలుగు గంటలు పాటు వెలిగేలా సోలార్ విద్యుత్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. కానీ హోటల్‌లో అలాంటివేమీ కనిపించలేదు.
♦అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్నిప్రమాద నిరోధకాలు ఏర్పాటు చేయాలి. కానీ హోటల్‌ల్లో స్మోక్ అలారం కూడా లేదు. సెంట్రల్ ఏసీ ఉన్న భవనాలకు ఆటోమేటిక్ స్మోక్ డంపర్స్ ఉండాలి. ఇదిలేకపోవటంతో ఏసీ పైపుల ద్వారా పొగ హోటల్‌ల్లోని అన్ని గదుల్లో వ్యాపించే అవకాశం ఉంది. ఫైర్ ఎగ్జిట్‌మెట్లు లేకపోవటం, ఆటోమేటిక్ ఫైర్ స్ప్రింకర్లు ఏర్పాటు చేసుకోకపోవటంతో ప్రమాద స్థాయి తీవ్రతను తెలియజేస్తోంది.
పార్కింగ్‌లో నిర్మాణాలు
భవన నిర్మాణ నిబంధనల మేరకు సెల్లార్‌లో కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలి. కానీ విజయవాడ నగరంలోనిæ స్వర్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మాత్రం అవేమీ పట్టించుకకోకుండా హోటళ్లను నిర్వహిస్తోంది. ఏలూరు రోడ్డులోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ సెల్లార్‌ను స్టోర్ రూంగా వినియోగిస్తుండగా... లబ్బీపేట బందరురోడ్డులోని హోటల్‌లో కిచెన్ నిర్వహిస్తోంది. రింగ్‌రోడ్డులోని హోటల్ మెట్రోపాలిటిన్ హోటల్‌ది అదే తీరు.. ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక వాహనం తిరిగేందుకు హోటళ్లకైతే రెండు మీటర్ల సెట్‌బ్యాక్ ఉండాల్సిందిగా భవన నిర్మాణ నిబంధనలు ఉంటే కేవలం ఒక మీటర్లే సెట్‌బ్యాక్ వదిలారు. దీనిపై గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు.
ఇతర హోటళ్లదీ.. షాపింగ్‌కాంప్లెక్స్‌లదీ అదేతీరు..
గత ప్రభుత్వాల హయాంలో భవన నిర్మాణాలలో అనేక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.. లబ్బీపేటలో పీవీపీ రోడ్డులో ఉన్న హోటల్ మినర్వ జీప్లస్3కి అనుమతి తీసుకుని అనధికారికంగా ఒక ఫ్లోర్ నిర్మాణం చేసింది. బీపీఎస్(బిల్డింగ్ పేనలైజేషన్‌కు స్కీం) కు దరఖాస్తు చేసుకున్నా పెనాల్టీ చెల్లించకపోవటంతో ఇటీవల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెడ్ నోటీస్(ఇది అత్యవసరంగా, ప్రమాదకరంగా ఉండే వాటిని మాత్రమే జారీ చేస్తారు) అంటించినా స్పందించలేదు. దీనికితోడు సెట్‌బ్యాక్స్‌లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయకూడదని భవన నిర్మాణ నిబంధనలున్నా అక్కడ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపైగతంలో దుమారం రేగటంతో కొంతకాలం ఆపేసినా తర్వాత వ్యాపారాన్ని కొనసాగించింది.
♦స్వర్ణ హోటల్స్ గ్రూపునకు చెందిన మరో హోటల్ ఏలూరు రోడ్డులోని ఆయూష్ ఆస్పత్రి ఎదురుగా హోటల్‌కు భవనం నిర్మాణమంతా అనధికారికమే. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలో గత అక్టోబరులో అనధికారిక ఫ్లోర్‌ను అధికారులు పగలకొట్టారు. కొద్ది నెలలకే ఫ్లోర్‌ను మళ్లీ నిర్మించారు.
♦హోటల్ మురళీఫార్యూ్చన్ అనధికారికంగా రెండు అంతస్తులను నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు పోతున్నారు.
♦ఏలూరు రోడ్డులోని స్వర్ణ కాంప్లెక్స్‌పై రినోవేషన్ పేరుతో అనధికారికంగా ఫ్లోర్ వేసినా అధికారులు పట్టించుకోలేదు. దీనికితోడు సినిమా థియేటర్ల, ఆడిటోరియాలకు వర్తించే నిబంధనలను గాలికి వదిలేసి రెండోస్టేర్ కేస్ లేకుండా అలాగే నిర్వహిస్తుంది. అగ్నిప్రమాదం జరిగితే సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు మైక్రోవోవెన్‌లో మాదిరి అందులో కాలిపోవాల్సిందే.
♦ బందరు రోడ్డులోని హోటల్ వివాంతది కూడా అదే నేపథ్యంలో హోటల్ పై అంతస్తులో ఉన్న కాఫీ షాప్ కూడా అనధికారికమే.
♦లెనిన్‌సెంటర్‌లో ఉన్న చందన బ్రదర్స్‌పై అనధికారికంగా నిర్మాణం చేపట్టినా అధికారులు, సిబ్బందికి ముడుపులు అందటంతో చూసీ చూడనట్లు వ్యవహరించారు.
♦బందరురోడ్డులోని కళాంజలి కాంప్లెక్‌దీ అదేతీరు. అధికారికంగా జీప్లస్ 3 అనుమతి తీసుకుని అనధికరింగా మరో అంతస్తు నిర్మించింది. వీటికి ఫైర్ ఎన్‌ఓసీ లేదు.
♦కళానికేతన్ భవనానికి అదేతీరు.. సరైన సెట్‌బ్యాక్స్ మాత్రమే ఉన్న ఈ భవనం లోపల అనుమతులు మించి కట్టడాలు చేయటం, అనధికారికంగా ఫ్లోర్ వేసి వ్యాపారం చేస్తున్నారు.
ముందస్తు చర్యలు తీసుకుంటాం
విజయవాడ నగరంలో ఉన్న భారీ భవనాల యాజమానులు నిబంధనల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని నిర్మాణాలు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేది ఓ కేటగిరీలో వ్యాపార కార్యాకలాపాలు సాగించేది మరో కేటగిరీలో. దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా స్కూల్స్, హాస్పిటల్స్, హోటళ్లను ముందస్తు పరిశీలన చేశాకే అనుమతులు మంజూరు చేస్తాం. –ఉదయ్, రీజనల్ ఫైర్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment