టీ.. దీనికి అభిమానులు కోట్లలో ఉన్నారు. పనిఒత్తిడి నుంచి స్వాంతన కోసం టీ తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్ ఔషధం. బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, మిరియాల టీ ఇలా టెస్ట్ చేసి ఉంటారు. మార్కెట్లోకి కొత్త రకం చాయ్ వచ్చింది. అదే తందూరీ టీ.. నెల్లూరులో దీనికి అభిమానులు పెరుగుతున్నారు.
నెల్లూరు(మినీబైపాస్): టీ.. ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్‌ల్లో కూర్చొని సరదాగా గడిపేందుకు.. పనిఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. తలనొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామందికి టీ కావాలి. టీ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది. అదే తందూరీ టీ.. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ చాయ్ రుచిని ఇప్పుడు నెల్లూరులో కూడా చూడొచ్చు. నగరంలోని కొందరు వ్యాపారులు టీ అభిమానుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. దీని ఎక్కువేమి కాదు. ధర రూ.20 మాత్రమే..
ఏంటిదీ..
తందూరీ అనే పదం మాంస ప్రియులకు బాగా పరిచయం ఉంటుంది. హోటళ్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి తందూరీగా కస్టమర్లకు అందిస్తారు. ఈ చాయ్‌ని కూడా నిప్పులపైనే చేస్తారు కాబట్టి తందూరీ టీగా పేరొచ్చింది.
ఎలా చేస్తారంటే..
మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమిలా ఏర్పాటు చేస్తారు. ఇందులో బొగ్గులు వేసి మండించి బట్టీల్లో ఇటుకల్లా కాలుస్తారు. పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి టీ తయారు చేసి దానిని జార్‌లో పోసి కొలిమి వద్దకు తీసుకొస్తారు. కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఇత్తడి పాత్రలో ఉంచుతారు. అందులో చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టి పాత్ర వేడికి పొగలు చిమ్ముతూ నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరీ రుచి.. వాసన వస్తుంది.
రుచి.. అదుర్స్
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే.. మరికొన్నింటిని రుచి కోసమే చేస్తున్నారు. ఈ రెండింటికీ డిమాండ్ అధికంగా ఉంది. టీ లవర్స్‌కు వినూత్న రుచిని అందించేందుకు కొందరు వ్యాపారులు తందూరీ టీ స్టాల్స్‌ను ప్రారంభిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment