సాక్షి, కాకినాడ: నగరంలోని గోళీలపేటలో లైంగిక దాడికి గురైన బాలికను మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జీజీహెచ్‌లో శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాలికకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి తక్షణ సాయం లక్ష రూపాయలు అందచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క బాలిక, మహిళపై అత్యాచారాలు జరగకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. (చదవండి: తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా)
నిఘా కొరవడిన మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తోందన్నారు. దిశ చట్టం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని, త్వరలోనే కొన్ని సవరణలతో చట్టం తీసుకొస్తామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించామని, కేసులపై సత్వరమే స్పందిస్తున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. (చదవండి: దారుణం.. పసిమొగ్గపై పైశాచికం)
బాధితురాలికి అండగా ఉంటాం: మంత్రి వేణుగోపాల కృష్ణ
లైంగిక దాడికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. చిన్నారిపై పాశవిక దాడి.. మనస్సు కలిచివేస్తోందన్నారు. నిందితులను పట్టుకోడానికి పోలీస్ బృందాలు నిర్విరామంగా గాలిస్తున్నాయని తెలిపారు. మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment