కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు సంబంధించిన నకిలీ డీడీల కుంభకోణం కేసు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డీడీలను అపహరించి రూ.8.29 కోట్లు కాజేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధించింది. అలాగే హైదరాబాద్‌లోనే ఓల్డ్ సిటీలో ఉన్న ఎస్‌బీఐ హుస్సేన్ ఆలంఖాన్ బ్రాంచ్‌లో కూడా డీడీల కుంభకోణం చేసి రూ.3.20 కోట్లు మోసం చేశారనే మరో కేసులో ఆయనకు రెండేళ్ల క్రితం సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులను సవాల్ చేస్తూ ఆయన అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈయనపై నమోదైన ఈ రెండూ వేర్వేరు కేసులైనప్పటికీ హైకోర్టు ఒకటిగా పరిగణించి ఈనెల 18న విచారించనుంది.
కోర్టులో శిక్ష పడిన కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ 2019 ఎన్నికల సమయంలో కొందరు అభ్యంతరం తెలిపారు. అయితే కోర్టు అనుమతివ్వడంతోనే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అప్పటి కదిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింట్ అధికారి అజయ్‌కుమార్ తెలియజేశారు. కోర్టులో శిక్ష పడిన ఖైదీ కందికుంటకు టీడీపీ అధినేత చంద్రబాబు కదిరి టికెట్ ఇచ్చారని, అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడించాలని వైఎస్సార్‌సీపీ ఎన్నికల సమయంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీన్ని ప్రజలు నమ్ముతూ 2019 ఎన్నికల్లో కందికుంటను ఓడించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డా.పీవీ సిద్దారెడ్డిని సుమారు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ తరుణంలో కందికుంటపై నమోదైన రెండు వేర్వేరు బ్యాంకులకు సంబందించి నకిలీ డీడీల కేసు 18న విచారణకు రానుందని తెలిసి ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment