కమిషనర్‌తో వాగ్వాదం చేస్తున్న టీడీపీ నేతలు
పుత్తూరు రూరల్: మా ఫ్లెక్సీలనే తొలగిస్తావా? అంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్‌పైకి దూసుకెళ్లారు. పుత్తూరులో జరిగిన ఈ ఫ్లెక్సీల రాద్ధాంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ సిబ్బంది వైఎస్సార్ సర్కిల్ నుంచి ఫ్లెక్సీలను తొలగిస్తూ వస్తున్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి ఉపక్రమించారు.
విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చి మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామిరెడ్డిని టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అయినా 15 రోజులుగా గడువిచ్చామని, నేడు తొలగించాలని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు కమిషనర్‌పైకి దూసుకెళ్తూ దుర్భాషలాడారు.
ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయినా కమిషనర్ అక్కడే నిలబడడంతో, కొంతసేపటికి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీవరత్నంనాయుడు తమ ఫ్లెక్సీలకు చలానాలను కట్టి అనుమతి తీసుకుంటామని, అంత వరకు ఫ్లెక్సీలు యథాస్థానంలో ఉండాలని కోరారు. ఇందుకు కమిషనర్ సమ్మతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులను అక్కడి నుంచి వాహనాల్లో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేని ఫ్లెక్సీలను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment