సాక్షి, అమరావతి : రాజకీయ పార్టీ అంటే నాయకులుండాలి. క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు కొరత లేకుండా నాయకులు ఉంటేనే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో నిలబడగలుగుతుంది. కానీ, అసలు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా లేని పార్టీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని, అదీ ముందస్తు ఎన్నికలు వచ్చినా మాకేం పరవాలేదు అంటూ బీరాలు పలికితే.. ఆ పార్టీ టీడీపీ అవుతుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అవుతారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను చూసి రాజకీయ నేతలు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో టీడీపీ కేడర్, నేతలు కనుమరుగైపోయారు. పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలు లేక, పార్టీ కార్యక్రమాలను పట్టించుకునే నాథుడే లేక చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త వారిని ప్రోత్సహిస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 50కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌ఛార్జిలే లేరు. మిగిలిన చోట్లా సగానికిపైగా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలు, నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.
కృష్ణాలోనూ నాయకుల కొరత
టీడీపీకి గట్టి పట్టున్నట్టు చెప్పుకొనే కృష్ణా జిల్లాలోనే నాయకుల కొరత ఏర్పడింది. గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా మచిలీపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. అయినా ఆయన గన్నవరం వైపు పెద్దగా వెళ్లడంలేదు. విజయవాడ పశ్చిమలో జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారు పార్టీని నడిపించలేకపోతుండడంతో ఏంచేయాలో బాబుకు పాలుపోవడంలేదు. కైకలూరులోనూ నాయకుల కొరత వేధిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాల్లో కొత్త నాయకుల కోసం వెదుకుతున్నారు.
మాజీ మంత్రి జవహర్ కొవ్వూరుతో పాటు దూరంగా ఉన్న కృష్ణా జిల్లా తిరువూరులోనూ తిరగాల్సిన పరిస్థితి. ఆయన ఏ నియోజకవర్గానికి ఇన్‌చార్జో అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటోంది. విజయనగరం జిల్లా కురుపాం, నెల్లిమర్ల ఇన్‌ఛార్జిలు పతివాడ నారాయణస్వామి, శత్రుచర్ల విజయరామరాజులకు వయసు పైబడడంతో బయటకు రావడమే లేదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని పాడేరు, అరకు, మాడుగుల నియోజకవర్గాల్లో సరైన నాయకులే లేరు.
పట్టించుకునే వారు ఎవరు?
గుంటూరు జిల్లాలో వేమూరు, సత్తెనపల్లిలో టీడీపీని ఎవరు నడిపిస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడిని పార్టీ కేడర్ అంగీకరించడంలేదు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, రంపచోడవరం, గన్నవరం నియోజకవర్గాల్లో సరైన నాయకులే లేరు. చీరాల, నెల్లూరులోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు నగరంలోనే పార్టీని పట్టించుకునే వారు కనిపించడంలేదు.
ఇటీవల జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క కార్పొరేటర్ పదవి కూడా రాలేదు. రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైందని టీడీపీ నేతలు వాపోతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, కోడూరు, బద్వేలు, ప్రొద్దూటూరు నియోజకవర్గాలకు నాయకులు లేరు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో శింగనమల, అనంతపురం అర్బన్, మడకశిరలో నాయకత్వ సమస్య ఉంది. చిత్తూరు జిల్లా పుంగనూరు, సత్యవేడు, పూతలపట్టు వంటి చోట్ల నాయకులు లేరు.
ఈ నేతలు చేతులెత్తేశారా!
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జిలు కూడా చురుగ్గా పనిచేయడంలేదు. వీరిలో చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల దూకుడును తట్టుకోలేక అనేక మంది చేతులెత్తేసిన వాతావరణం కనిపిస్తోంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పుల్లారావు, నెల్లూరులో నారాయణ, ఏలూరులో మాజీ మంత్రి మాగంటి బాబు, విశాఖలో గంటా శ్రీనివాసరావు, విజయనగరంలో సుజయకృష్ణ రంగారావు, కర్నూలులో కేఈ కృష్ణమూర్తి వంటి నేతలు అసలు పార్టీ వైపే పెద్దగా కన్నెత్తి చూడడంలేదు. ఈ నేపథ్యంలో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తామని, కొత్త నాయకులకు అవకాశం ఇస్తామని చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. పని చేయకపోతే ఇన్‌చార్జిలను మారుస్తామని చెప్పడం వెనుక తెలుగుదేశం పారీ్టలో ఉన్న నాయకత్వ కొరతను తేటతెల్లం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment