కోర్టులో స్టే ఉన్నప్పటికీ నిబంధనలు అతిక్రమించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవంతి , ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు చేయవద్దని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కు నోటీసులు ఇస్తున్న రెవెన్యూ అధికారులు
మదనపల్లె: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార బలంతో అక్రమంగా ఆక్రమించుకున్న చెరువు పోరంబోకు స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేయడమే కాక అనుమతిలేకుండా అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం అధికారుల తనిఖీలో బట్టబయలైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అవినీతి, ఆక్రమణ, అక్రమ నిర్మాణాల బాగోతం అధికారుల హెచ్చరిక బోర్డు ఏర్పాటుతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఇన్నాళ్లు హైకోర్టులో కేసు ఉందని, లోనికి ఎవరూ ప్రవేశించరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన ఆయన.. లోపల మాత్రం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని దర్జాగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక.. పెద్ద షెడ్‌లు ఏర్పాటుచేసి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేయడంపై పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు.
దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. పట్టణంలోని బండమీద కమ్మపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్–8 పార్టు, విస్తీర్ణం.3.09 ఎకరాల్లో ప్రభుత్వ స్థలానికి సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్నందున భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని జిల్లా కలెక్టర్ గిరీషా ఉత్తర్వులతో మాజీ ఎమ్మెల్యే ఆక్రమిత స్థలంలో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక బోర్డు పెట్టారు.
అంతేకాక.. మున్సిపల్, రెవెన్యూ అధికారులు భూమి మొత్తం కలియతిరిగి అందులోని చెట్లను, టీడీపీ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన భవనాన్ని, అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన రెండు షెడ్‌ల కొలతలు తీశారు. ఈ సమయంలో.. తాను మాజీ ఎమ్మెల్యేనని, కావాలంటే గూగుల్ మ్యాప్స్ తీసుకోవాలని దొమ్మలపాటి రమేష్ వ్యాఖ్యానించారు.
అడ్డదారుల్లో దురాక్రమణ ఇలా..
బండమీద కమ్మపల్లె పంచాయతీలో సర్వే నంబర్–8లో ఐదెకరాలు పూర్తిగా చెరువు పోరంబోకు స్థలం. అందులో తప్పుడు రికార్డులతో దొంగపట్టాలు పుట్టించి సర్వే నెం.8/1 పేరుతో ఇంద్రసేనరాజు పేరుతో 1984లో ఇచ్చినట్లుగా డీకేటీ పట్టా సృష్టించారు. అయితే, అదే సంవత్సరం అదే నంబర్‌తో వేరే వారికి పట్టా ఇచ్చినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే దొంగ డీకేటీ పట్టాను ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు కుదరకపోవడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయారు.
2016లో తహసీల్దార్ శివరామిరెడ్డి హయాంలో అన్‌లైన్‌లోకి ఎక్కించి ఇంద్రసేనరాజు నుంచి దొమ్మలపాటి రమేష్ భార్య దొమ్మలపాటి సరళ పేరు మీద రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ విషయమై అప్పట్లో పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసు పంపగా దానిమీద హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు కేసు నంబర్లను ప్రహరీగోడ మీద ప్రత్యేకంగా పేర్కొంటూ అనుమతిలేకుండా ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయించారు.
లోపలమాత్రం అనుమానం రాకుండా పెద్ద భవనాలు, షెడ్‌ల నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. మరోవైపు.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తుంటే టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శీను, మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ వెంకటేష్, ఇతర టీడీపీ నాయకులు అధికారుల విధులకు భంగం కలిగిస్తూ వారిని వీడియోలు, ఫొటోలు తీశారు. తాము విధి నిర్వహణలో ఉన్నామని అధికారులు వారిని వారిస్తున్నా మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటామని వ్యాఖ్యానించడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment