ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనుమల్లంలోని పంచాయతీ చెరువులో రూ.25 లక్షల విలువైన చేపల్ని టీడీపీ కార్యకర్తలు దొంగిలించారని లీజుదారు ఘొల్లుమంటున్నాడు. ఈ మేరకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పెనుమల్లంలోని పంచాయతీ చెరువుకు గత ఏడాది అక్టోబర్‌లో పంచాయతీ అధికారులు లీజు వేలం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని నడుమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు మునిరాజా రూ.50 వేల లీజుకు చేపల చెరువును దక్కించుకున్నాడు.
సుమారు రూ.5 లక్షలు వెచ్చించి చేప పిల్లల్ని కొనుగోలు చేసి చెరువులో వేసి పెంచుతున్నాడు. చేపల చెరువు కాలపరిమితి ఆదివారంతో ముగియనుంది. కాగా.. టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా చెరువులోని చేపల్ని వలలతో పట్టుకుని తీసుకుపోయారు. ఇదేమిటని అడిగినందుకు చెరువు వద్దకు వస్తే తాట తీస్తామని బెదిరించడంతో బాధితుడు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
చెరువులోని సుమారు రూ.25 లక్షల విలువైన చేపలను టీడీపీ కార్యకర్తలు పట్టుకుని వెళ్లారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ను వివరణ కోరగా.. ఆదివారం వరకు చేపల చెరువుకు కాలపరిమితి ఉందని, సమస్యపై చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment