సాక్షి, అమరావతి: ‘ప్లాట్లు అమ్ముతాం బాబూ.. అమరావతిలో ప్లాట్లు అమ్ముతాం.. కొంత తక్కువ ధరకే ఇస్తాం.. మంచి అవకాశం.. త్వరగా వచ్చి కొనుగోలు చేయండి.’ ఇదీ అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల తాజా నినాదం. ఇందులో విశేషం ఏముందీ అంటారా.. అక్కడే ఉంది అసలు గుట్టు.
అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం సమీకరించిన భూముల్లో వారికి సంబంధించిన భూమి ఒక్క సెంటు కూడా లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినట్టుగా కనికట్టు చేసి ప్లాట్లు పొందారు. ఈ బండారం సీఐడీ దర్యాప్తుతో బట్టబయలు అవుతుండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. అమరావతిలో మరో కొత్త భూదందాకు తెరతీశారు.
ఇదీ ఉద్యమ నేత తీరు..
ఆయన అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమనేత. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతిలో ఆయనకున్న 20 ప్లాట్లను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల జాబితాలో ఆయన పేరే లేదు. కానీ అసైన్డ్ రైతుల పేరిట అక్రమంగా ఆయనకు గత ప్రభుత్వం 20 ప్లాట్లు కేటాయించింది.
రిజిస్టర్ సేల్ డీడ్ కింద వాటిని ఆయన పేరిట రిజస్టర్ చేశారు. అవన్నీ తుళ్లూరు మండలం మందడం పరిధిలోనివే కావడం గమనార్హం. సర్వే నంబర్లు 199, 133, 131, 242, 236, 321, 308, 307, 268, 295, 408, 296, 413, 465తో ఉన్న ఆ ప్లాట్లను ఆయన విక్రయించేందుకు యత్నిస్తుండటం అమరావతిలో చర్చనీయాంశంగా మారింది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములన్నీ పలువురి రైతుల పేరిట ఉన్నాయి. కానీ సీఆర్‌డీయే రికార్డుల్లో మాత్రం అమరావతి పరిరక్షణ సమితి నేత పేరిట నమోదు కావడం గమనార్హం. ఆ భూముల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన కొందరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
వెంకటపాలెంలో సర్వే నంబరు 295/10, 296/5, మందడంలో సర్వే నంబరు 454/3సీ, కురగల్లులో సర్వే నంబరు 500/1లో ఉన్న ప్లాట్లు కూడా విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.
964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు
అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. సీఐడీ దర్యాప్తులో ఈ బండారం మొత్తం బయటపడింది. అమరావతిలో 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటన్నది పరిశీలించినప్పుడు టీడీపీ భూ బాగోతం గుట్టు రట్టయింది.
రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్‌డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. బడుగు, బలహీన వర్గాల రైతుల స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు.
వాటిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. వాటిలో అత్యధిక భాగం టీడీపీ పెద్దలు తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. అనంతరం ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా చూపించి ప్లాట్లు తీసుకున్నారు. బినామీలుగా ఉన్నందుకు కొందరు అనుయాయులకు కూడా కొన్ని ప్లాట్లు కేటాయించారు.
వారిలో టీడీపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు. ప్రస్తుతం వారే అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్లాట్లను ఎలా విక్రయిస్తారన్నది తాడేపల్లి, మంగళగిరిలో హాట్ టాపిక్‌గా మారింది.
సీఐడీ దర్యాప్తుతో బెంబేలు
అమరావతి అక్రమాలపై సీఐడీ దరా>్యప్తుతో అసైన్డ్ దొంగలు కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం నిగ్గు తేలితే తాము అక్రమంగా పొందిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆ ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు యత్నిస్తున్నారు.
ప్రధానంగా టీడీపీ నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నవారే తమ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తుండటం గమనార్హం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని న్యాయస్థానం చెప్పింది. దాంతో బోగస్ అమరావతి రైతు ఉద్యమ నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది.
గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాదయాత్ర నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత లేదు. దాంతో తాము అక్రమంగా పొందిన ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.
భూమి చూపించకుండానే కేవలం సేల్ డీడ్ పత్రాలను చూపించి ప్లాట్ల విక్రయాల దందాకు తెరతీశారు. తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం, కురగల్లు, పెనుమాక, నవులూరు తదితర గ్రామాల్లో అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు లావాదేవీలు జోరందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment