సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అసైన్డ్ భూములు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ రూపొందించడంలో అక్రమాలపై సీఐడీ అధికారులు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అనే రీతిలో నారాయణ వ్యవహరించారని తెలిసింది.
ఈ మేరకు సీఐడీ అధికారులు
నారాయణ, ఆయన భార్య పి.రమాదేవి, నారాయణ విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా సంస్థలో కీలక స్థానంలో ఉన్న పొత్తూరి ప్రమీల అనే ఉద్యోగిని హైదరాబాద్‌లో సోమవారం వేర్వేరుగా విచారించారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్ స్పైరా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపుపై సీఐడీ అధికారులు నారాయణను ప్రశ్నించారు.
ఇక ఆ నిధులతో బినామీల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన రికార్డులు చూపిస్తూ పలు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. అలాగే నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే స్టార్టప్ సిటీ వచ్చేలా సీఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఉదంతంపైన కూడా వివరాలు అడిగారు.
ఆ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ మాస్టర్ ప్లాన్‌ను ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. అలాగే నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వారి సన్నిహితుడు లింగమనేని కుటుంబానికి చెందిన సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చేలా నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
కానీ నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించకూడదని ఆయన ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా వ్యవహరించారని సమాచారం. అలాగే నారాయణ భార్య రమాదేవి, పొత్తూరి ప్రమీల కూడా విచారణకు ఏమాత్రం సహకరించ లేదు.
నారాయణ కుమార్తెను ఇంటి వద్దే విచారించండి
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్, అతడి సోదరుడు వరుణ్ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ బాబీలు హైకోర్టును ఆశ్రయించారు.
వీరి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సింధూరను ఆమె ఇంటి వద్దే ఈ నెల 20న విచారించాలని సీఐడీని ఆదేశించారు. అలాగే అదే రోజున సీఐడీ ముందు హాజరు కావాలని పునీత్, వరుణ్‌లకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇక అంజనీ కుమార్‌ను అదే రోజున న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment