మృతిచెందిన నరేష్, ఉమాదేవి, నిషిత (ఫైల్)
మదనపల్లె టౌన్: బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకుని ఊరుగాని ఊరువచ్చాడు. 16 ఏళ్లుగా ఓ చికెన్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రులను చూడాలని సొంత ఊరికి వెళ్లాడు. ఆదివారం చికెన్ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని పొద్దుపోయాక భార్య,కుమార్తెను వెంటబెట్టుకుని బైక్‌లో మదనపల్లెకు బయలుదేరాడు. చిమ్మచీకటి, చినుకులు పడుతున్నా లెక్కచేయలేదు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్తామనగా మృత్యువు గుర్తుతెలియని వాహనం రూపంలో దూసుకొచ్చింది. ముగ్గురి ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకా, రాయలపాడు సమీపంలోని వేపనపల్లెకు చెందిన డి నరేష్(35), భార్య ఉమాదేవి(26), కుమార్తె నిషిత(5) మదనపల్లె పట్టణంలోని పుంగనూరు రోడ్డులో నివాసముంటున్నారు.
అక్కడే ఓ చికెన్ సెంటర్‌లో నరేష్ కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో తల్లిదండ్రులను చూసిరావడానికి భార్య, కుమార్తెతో శుక్రవారం ఉదయం కర్ణాటకకు వెళ్లాడు. ఆదివారం చికెన్ వ్యాపారం పుంజుకుంటుందని తెలుసుకుని శనివారం రాత్రి తిరిగి మదనపల్లెకు బయలుదేరాడు. ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా ఎక్కడా ఆగలేదు. మదనపల్లె సమీపంలోని బెంగళూరు బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఆపై ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నరేష్, ఉమాదేవి, నిషిత అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మార్చురీకి తరలించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.
చదవండి: ఉసురు తీసిన ప్రేమ
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment